టెల్కోల టార్గెట్: రూ.లక్ష కోట్ల నిధులు, ఇప్పట్లో ఛార్జీల పెంపు లేనట్లే

By rajashekhar garrepallyFirst Published Apr 25, 2019, 3:52 PM IST
Highlights

భారత టెలికం రంగం ప్రస్తుతం కన్సాలిడేషన్ దశలో ఉన్నది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో భారతీయ టెలికం సంస్థలు నిధుల సమీకరణపై దృష్టి కేంద్రీకరించాయి.

న్యూఢిల్లీ: దేశంలోని టెలికాం కంపెనీలు కన్సాలిడేషన్‌ దశలో ఉన్నాయని, ఈ కంపెనీలు రూ.లక్ష కోట్లకు పైగా నిధులను సమీకరించే పనిలో నిమగ్నమైనట్టు అంతర్జాతీయ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకర్‌ జెఫ్రీస్‌ పేర్కొన్నది. 2019-20 ప్రథమార్థంలో ఈ నిధులను కంపెనీలు సమీకరించనున్నాయని తెలిపింది. 

వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీలు రూ.25,000 కోట్ల చొప్పున రైట్స్‌ ఇష్యూ ద్వారా నిధులను సమకూర్చుకోనున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌ సమీకరించే మొత్తం ఆ కంపెనీకి సరిపోయే అవకాశం ఉన్నా.. వొడాఫోన్‌ఐడియాకు మాత్రం సరిపోకపోవచ్చునని జెఫ్రీస్‌ భావిస్తోంది.

మరోవైపు రిలయన్స్‌ జియో కొత్త కస్టమర్లను సంపాదించుకోవడంపై దృష్టి సారించింది.  జియో తన ఫైబర్‌, టవర్‌ ఆస్తులను ప్రత్యేక కంపెనీగా విభజించింది. ఇందులో మెజారిటీ వాటా ఇన్విట్స్‌కు ఉంది. రూ.1,07,300 కోట్ల అప్పులను బదిలీ చేసింది. ఈమేరకు ఈక్విటీ ఫండింగ్‌ అవసరం ఉంటుంది. 

మార్కెట్లో సర్దుబాట్లకు మరో ఏడాది కాలం సమయం పడుతుందని జెఫ్రీస్ అంచనా వేసింది.  ప్రత్యేకించి పోస్ట్ పెయిడ్ సెగ్మెంట్ విభాగంలో పోటీ తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. ఇక టెలికాం సర్వీసుల్లో ధరల పెరుగుదల 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఉండకపోవచ్చని జెఫ్రీస్‌ అంచనా వేసింది. 

ఒకవైపు భారతీ ఎయిర్ టెల్ రైట్స్ ఇష్యూ, జియో డీ మెర్జర్ ప్రణాళికలతో సర్వీస్‌ల చార్జీల పెంపునకు మరింత సమయం పడుతుందని తెలుస్తోంది. డిజిటల్ పోర్ట్ ఫోలియోలో పూర్తిగా పట్టు సాధించడమే లక్ష్యంగా రిలయన్స్ జియో సాగుతోంది. రిటైల్ మార్కెట్లోకి ఎంటర్ కావాలని జియో ప్రణాళికలు రూపొందించిన సంగతి తెలిసిందే.

40 శాతం మార్కెట్‌ వాటాతో టెలికాం మార్కెట్లో కీలకమైన కంపెనీగా జియో మారిన తర్వాత అంటే 2021 ఆర్థిక సంవత్సరంలో ధరల పెరుగుదల ఉండవచ్చని పేర్కొంది. 2021-22 నాటికి వొడాఫోన్ ఐడియా మార్కెట్‌ వాటా 20 శాతానికి తగ్గవచ్చని, భారతీ ఎయిర్‌టెల్‌ వాటా మాత్రం 30 శాతం వద్ద స్థిరంగా ఉండవచ్చని తెలిపింది.

కొత్త కస్టమర్లు, వినియోగంపై జియో దృష్టిసారిస్తున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్‌ కోలుకునేందుకు మరో ఏడాది పట్టవచ్చని జెఫ్రీస్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం 31.4 శాతం మార్కెట్‌తో టెలికం రంగంలో వొడాఫోన్ ఐడియా మొదటి స్థానంలో నిలిచింది.

భారతీ ఎయిర్ టెల్ 30.6 శాతంతో రెండో స్థానంలో, 300 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్లతో రిలయన్స్ జియో 29.2% వాటాతో మూడో స్థానంలో నిలిచింది. 50% వాటా చేజిక్కించుకోవాలని జియో లక్ష్యంగా పెట్టుకున్నదని జెఫ్రీస్ అంచనా వేసింది. ఆర్థిక ఇబ్బందులతో వచ్చే 18 నెలల్లో మార్కెట్లో తక్కువకు వొడాఫోన్ వాటా 25 శాతానికి పడిపోతుంది. అదనపు నిధులు లభిస్తేనే వొడాఫోన్ ముందుకెళ్లగలదు. మీడియం టర్మ్‌లో ఎయిర్ టెల్ బెటర్ ప్లేస్డ్ గా ఉన్నా.. ప్రస్తుతం రిస్క్ ఫేస్ చేస్తోంది. 

click me!