18 ఏళ్ల కుర్రాడితో రతన్ టాటా బిజినెస్.. ఫార్మా స్టార్టప్‌లో పెట్టుబడులు..

By Sandra Ashok Kumar  |  First Published May 8, 2020, 12:04 PM IST

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఏం చేసినా ఆసక్తికరంగానే ఉంటుంది. టాటా సన్స్ చైర్మన్‌గా వైదొలిగిన తర్వాత ఆయన వ్యక్తిగత హోదాలో కొన్ని సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. తాజాగా యంగ్ స్టార్టప్ జెనెరిక్ ఆధార్‌లో 50 శాతం వాటా కొనుగోలు చేశారు. యువతరంతో కలిసి పని చేయడం వల్ల కుర్రాళ్ల ఆలోచనలు, ఆకాంక్షలు తెలుసుకోవచ్చుంటారాయన.
 


ముంబై: టాటా సన్స్ చైర్మన్ ఎమిరస్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తాజా పెట్టుబడులు ఆసక్తికరంగా నిలిచాయి. టాటా సన్స్ చైర్మన్‌గా వైదొలిగిన తర్వాత స్టార్టప్ కంపెనీల్లో వ్యక్తిగత స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారు. దీనికి ఆయన చెప్పిన రీజనింగ్ కూడా ఆసక్తికరంగానే ఉంది. 

యువతరంతో కలిసి పని చేయడం వల్ల ప్రస్తుతం సమాజంలో యువత ఆలోచనలు, ఆకాంక్షలు తెలుసుకోవచ్చునని రతన్ టాటా చెప్పారు. తాజాగా ఫార్మా స్టార్టప్ కంపెనీలో వ్యక్తిగత స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ పెట్టుబడుల వివరాలను ఆయన వెల్లడించలేదు.  

Latest Videos

undefined

ముంబైలోని  యువ వ్యవస్థాపకుడు, సీఈవో  అర్జున్ దేశ్‌పాండే (18)కు  చెందిన ‘జనరిక్‌ ఆధార్‌' అనే స్టార్టప్ సంస్థలో 50 శాతం వాటాను రతన్ టాటా తాజాగా కొనుగోలు చేశారు. సంస్థ ప్రస్తుత టర్నోవర్ రూ.6 కోట్లు.. వచ్చే రెండు, మూడేళ్లలో దాన్ని రూ. 150-200 కోట్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

సరసమైన ధరలకే ఔషధాలను అందించాలనే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం ముంబై నివాసి అర్జున్‌ దేశ్‌పాండే 2018లో రూ. 15 లక్షల  ప్రారంభ నిధులతో ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు. జెనెరిక్ ఆధార్ ఓ ఫార్మసీ-అగ్రిగేటర్. 

జెనెరిక్ ఔషధాలను తయారీదారు నుండి నేరుగా చిల్లర వ్యాపారులకు ఈ స్టార్టప్ అందిస్తుంది. దళారీల దోపిడీని అడ్డుకోవడంతోపాటు ఖర్చును తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఫలితంగా మార్కెట్ ధర కంటే 20-30 శాతం తక్కువకే మందులను విక్రయిస్తుంది.

ప్రస్తుతం ఈ సంస్థలో ఫార్మసిస్ట్‌లు, ఐటీ ఇంజనీర్లు, మార్కెటింగ్ నిపుణులు సహా సుమారు 55 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ స్టార్టప్ సంస్థకు ఇప్పుడు ముంబైలో 35 ఫ్రాంచైజీలున్నాయి. ఇతర మెట్రో నగరాల్లోకి విస్తరించడం కోసం జెనెరిక్ ఆధార్ ప్రణాళికలు రూపొందించింది. 

also read ఇదే మంచి తరుణం: చైనాలోని అమెరికా కంపెనీలను ఆకర్షించేందుకు మోదీ చర్యలు...

అలాగే మున్ముందు 1,000 ఫ్రాంఛైజీలను ఏర్పాటుచేయాలని జెనెరిక్ ఆధార్ యోచిస్తోంది. దేశ రాజధాని నగరం న్యూఢిల్లీతోపాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, గోవా, రాజస్థాన్, గుజరాత్ వంటి మార్కెట్లకు తమ పరిధిని విస్తరించాలని జెనెరిక్ ఆధార్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 

ప్రభుత్వం ఆమోదించిన బ్రాండెడ్, జెనెరిక్, హోమియోపతి, ఆయుర్వేద ఔషధాలను జెనెరిక్ ఆధార్ అందిస్తుంది.  అంతేకాదు క్యాన్సర్ మందులను మార్కెట్ ధర కంటే చాలా తక్కువ రేటుకు త్వరలోనే ప్రజలకు అందించాలని ప్లాన్ చేస్తోంది. 

కంపెనీ ప్రతిభను గుర్తించి రతన్‌ టాటా పెట్టుబడులకు ముందుకు రావడం సంతోషంగా ఉన్నదని జెనెరిక్ ఆధార్ వ్యవస్థాపకుడు దేశ్‌పాండే తెలిపారు. ఫార్మా వ్యాపారంలో ఉన్న తన తల్లితో కలిసి విదేశాలకు వెళ్ళిన తరువాత జెనెరిక్ ఆధార్ ఆలోచన తనకు వచ్చిందని దేశ్‌పాండే చెప్పారు. 

డయాబెటిక్, హైపర్ టెన్షన్ డ్రగ్స్ విక్రయిస్తున్న జెనెరిక్ ఆధార్ మున్ముందు క్యాన్సర్ మందులు కూడా సరఫరా చేయనున్నది. పాల్ఘార్, అహ్మదాబాద్, పాండిచ్చేరి, నాగ్ పూర్ ల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ధ్రువీక్రుత పత్రాలు పొందిన సంస్థలతో ఈ జెనెరిక్ ఆధారం టై అప్ పెట్టుకున్నది. 

దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలకు సరసమైన ధరలకు మందులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకున్నానని జెనెరిక్ ఆధార్ వ్యవస్థాపకుడు దేశ్‌పాండే అన్నారు. మరో వైపు కొత్త వ్యాపారాలను నిర్మించాలనుకునే యువకులకు ఉద్దేశించిన సిలికాన్ వ్యాలీలోని థీల్ ఫెలోషిప్ (రెండేళ్లు) కోసం దేశ్‌పాండే షార్ట్ లిస్ట్ అయ్యారు. 

అర్జున్‌ దేశ్‌పాండే తల్లి ఔషధ మార్కెటింగ్ సంస్థ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు మందులను విక్రయిస్తుంటారు. తండ్రి ఒక ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్నారు. 
 

click me!