కొత్త ఏడాదిలో భారీగా ఉద్యోగ అవకాశాలు....

By Sandra Ashok KumarFirst Published Jan 2, 2020, 3:52 PM IST
Highlights

ప్రైవేట్ రంగమే ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థకు చుక్కాని కానున్నది. ఈ సంవత్సరంలో కొత్తగా ఏడు లక్షల ఉద్యోగాలు లభిస్తాయని మై హైరింగ్ క్లబ్, సర్కారీ నౌకరీడాట్ కామ్ సంయుక్తం నిర్వహించిన అధ్యయనం తేల్చింది. అందునా స్టార్టప్స్, ఈ -కామర్స్ రంగాల్లో కొలువులకు కొదవ లేదని.. ఉద్యోగాల కల్పనలో దక్షిణాది తొలి స్థానంలో ఉంటుందని వెల్లడించింది. 

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్న ప్రైవేట్‌ రంగం ఉద్యోగ కల్పనలోనూ జోరును కొనసాగిస్తున్నది. గతేడాది లక్షల మందికి ఉపాధి కల్పించిన ఈ రంగం..నూతన సంవత్సరంలోనూ ఏకంగా ఏడు లక్షల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నది. అయితే ఈ-కామర్స్, స్టార్టప్‌ల్లో అత్యధిక కొలువులు లభించనున్నాయి. 

మై హైరింగ్‌ క్లబ్ డాట్ కామ్‌, సర్కారీ-నౌకరి.ఇన్ఫో సంయుక్తంగా ఎంప్లాయిమెంట్‌ ట్రెండ్‌ సర్వే - 2020 (ఎంహెచ్‌ఎస్‌ఎన్‌) పేరిట నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న ప్రైవేట్‌ సంస్థలు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రకటించినట్లు ఎంహెచ్‌ఎస్‌ఎన్‌ సీఈవో రాజేశ్‌ కుమార్‌ తెలిపారు. 

also read పోలీసులకు బురిడీ...పాస్‌‌‌‌పోర్ట్ లేకుండా జపాన్ నుంచి పారిపోయిన నిస్సాన్-రెనాల్ట్ మాజీ ఎండీ

దేశంలోని 42 నగరాల్లోని 12 పారిశ్రామిక రంగాల పరిధిలో 4,278 కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ అండ్‌ ఎన్‌సీఆర్‌, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, పుణె నగరాలు ఉద్యోగ కల్పనలో తొలి స్థానాల్లో ఉన్నాయని, ఈ నగరాలు సంయుక్తంగా 5,14,900 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని తెలిపింది.

మిగతా ఉద్యోగాలు ద్వి, తృతీయ శ్రేణి నగరాల్లో లభించనున్నాయి. మెట్రో నగరాల కంటే ద్వి, తృతీయ శ్రేణి నగరాల్లో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్నాయని, ఖర్చులను తగ్గించుకోవడానికి కార్పొరేట్‌ సంస్థలు చిన్న నగరాల బాట పట్టడం ఇందుకు దోహదం చేస్తున్నదని ఎంహెచ్‌ఎస్‌ఎన్‌ సీఈవో రాజేశ్‌ కుమార్‌ చెప్పారు.

నైపుణ్యం కల సిబ్బందితో పోలిస్తే టెక్నాలజీ లేదా టెక్నికల్‌ నైపుణ్యం కలిగిన సిబ్బందికి అధిక డిమాండ్‌ ఉండనున్నదని ఈ సర్వే పేర్కొంది. 2019లో 5.9 లక్షల మందికి ఉపాధి లభించనున్నదని గతంలో అంచనా వేసినా 6.2 లక్షల మందికి అవకాశాలు లభించాయని తెలిపింది.

ఉద్యోగాలు సృష్టించడంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఈ-కామర్స్‌ రంగం 2020లోనూ అదే జోరు కొనసాగించనున్నదని సర్వే అభిప్రాయపడింది. ఒక్క క్లిక్‌తో నచ్చిన వస్తువును కొనుగోలు చేయడానికి యువత ఆసక్తి చూపడం, సమయం కూడా ఆదా కానుండటంతో ఆన్‌లైన్‌ సర్వీసులకే భారతీయులు మొగ్గు చూపుతున్నారు. 

ఫలితంగా గత ఐదేళ్లలో లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రైవేట్ రంగం 2020లోనూ 1.12 లక్షల నూతన ఉద్యోగాలు సృష్టించబోతున్నదని సర్వే వెల్లడించింది. ఈ-కామర్స్‌తోపాటు ఐటీ అండ్‌ ఐటీఈఎస్‌లో 1.05 లక్షల ఉద్యోగాలు లభించనుండగా, ఎఫ్‌ఎంసీజీలో 87,500, తయారీలో 68,900, బీఎఫ్‌ఎస్‌ఐలో 59,700, వైద్య రంగంలో 98,300 అవకాశాలు లభించనున్నాయని తెలిపింది.

also read విజయ్ మాల్యా ఆస్తుల వేలానికి... కోర్టు గ్రీన్ సిగ్నల్

ఉద్యోగ కల్పనలో దక్షిణ భారతదేశం మళ్లీ మొదటి స్థానానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని సర్వే పేర్కొంది. ఈ నూతనేడాదిలో తెలంగాణతోపాటు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో 2,15,400 మంది ప్రైవేట్‌ రంగంలో ఉపాది లభించనున్నది. ఉత్తర భారతంలో 1,95,700 మందికి, పడమరలో 1,65,700, తూర్పు 1,25,800 ఉద్యోగాలు సృష్టించబోతున్నది.

కానీ, వేతనాలు, బోనస్‌లలో వృద్ధి సింగిల్‌ డిజిట్‌కు పరిమితం కానుండగా, మొత్తంమీద వేతనాల్లో పెరుగుదల 8 శాతం కానున్నదని తెలిపింది. ఉద్యోగులకు ప్రతిఏటా ఇచ్చే ఇంక్రిమెంట్స్‌ 8 శాతం పెరుగనుండగా, బోనస్‌ మాత్రం 10 శాతం ఉండనున్నదని ఎంహెచ్‌ఎస్‌ఎన్‌ సీఈవో రాజేశ్‌ కుమార్‌ తెలిపారు. నైపుణ్య కొరత అధికమవడంతో కార్పొరేట్‌ సంస్థలు ప్రొఫెషనల్స్‌ను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయని, ఇందుకోసం ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్చడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక కొత్త ఉద్యోగాల్లో అధికంగా స్టార్టప్‌ల్లోనే ఉండనున్నాయి.
 

click me!