అపర కుబేరుడైనా ముకేశ్ వేతనం రూ.15 కోట్లే.. ఎందుకంటే?

By Siva KodatiFirst Published Jul 21, 2019, 10:48 AM IST
Highlights

కార్పొరేట్ సీఈఓల వేతనాలు భారీగా ఉంటాయన్న విమర్శల నేపథ్యంలో ముకేశ్ అంబానీ 2009 నుంచి తన వేతనాన్ని రూ.15 కోట్లకే పరిమితం చేసుకున్నారు. 
 

అపర కుబేరుడాయన.. భారత కార్పొరేట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. అదే ముకేశ్ అంబానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత. ఆయన వరుసగా 11 వ ఏటా తన వార్షిక వేతనాన్ని రూ.15 కోట్లకు మాత్రమే పరిమితం చేసుకున్నారు. 

2008-09 నుంచి ఆయన జీతం, ఇతర అలవెన్సులు కలిపి రూ .15 కోట్లకు మించకుండా జాగ్రత్తపడుతున్నారు.  అంటే ఏటా దాదాపు రూ. 24 కోట్లను వదులకుంటున్నారు. కాగా 2019 ఆర్థిక సంవత్సరంలో నిఖిల్ ఆర్ మేస్వానీ, హితాల్ మేస్వా సహా కంపెనీలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ పూర్తికాలం డైరెక్టర్ల జీతం వేతనం మాత్రం భారీగా పుంజుకుంది. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్‌) తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ వివరాలను ప్రకటించింది. అంబానీ బంధువులైన నిఖిల్ ఆర్ మేస్వానీ, హితాల్ మేస్వానీ ఒక్కొక్కరి వేతనం రూ .20.57 కోట్లకు పెరిగింది. ఇది 2017-18లో  రూ .19.99 కోట్లు,  2016-17లో రూ .16.58 కోట్లుగా ఉంది. 

అలాగే, అతని ముఖ్య కార్యనిర్వాహకులలో ఒకరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్. అతని వేతనం గత ఏడాదితో పోలిస్తే రూ.8.99 కోట్ల నుంచి రూ .10.01 కోట్లకు పెరిగింది.  నీతా అంబానీతో సహా ఆర్‌ఐఎల్‌కు చెందిన నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు సిట్టింగ్ ఫీజుతో పాటు ఒక్కొక్కరికి రూ. 1.65 కోట్లు కమిషన్‌గా లభించాయి. ఈ కమిషన్ 2017-18లో రూ .1.5 కోట్లు, అంతకుముందు సంవత్సరం రూ .1.3 కోట్లు మాత్రమే. 

గతేడాది అక్టోబర్ 17న  ఆర్‌ఐఎల్ బోర్డులోమాజీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) చైర్మన్ అరుంధతి భట్టాచార్య  రూ. 75 లక్షలను మాత్రమే కమిషన్‌గా పొందారు. కంపెనీ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముకేశ్‌ అంబానీ భార్య నీతా అంబానీకి ఫీజుగా రూ .7 లక్షలు దక్కాయి. అంతకుముందు సంవత్సరంలో ఇది రూ .6 లక్షలు. 

అంబానీతోపాటు, ఆర్‌ఐఎల్ బోర్డులో మెస్వానీ సోదరులు, ప్రసాద్, కపిల్‌ హోల్‌టైమ్ డైరెక్టర్లుగా ఉండగా, నీతా అంబానీతో పాటు, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో మన్సింగ్ ఎల్ భక్తా, యోగేంద్ర పీ త్రివేది, దీపక్ సీ జైన్, రఘునాథ్ ఎ మషెల్కర్, ఆదిల్ జైనుల్‌భాయ్‌ రమీందర్ సింగ్ గుజ్రాల్, షుమీత్ బెనర్జీ ,  అరుంధతి భట్టాచార్య ఉన్నారు. 

కాగా  కార్పొరేట్ సీఈవోల వేతనాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటున్నాయన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2009 అక్టోబర్‌లో స్వచ్ఛందంగా తన వేతనాన్ని రూ. 15 కోట్లకు పరిమితం చేసుకుంటున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. 

2009 నుంచి నేటి వరకు ముకేశ్ అంబానీ తన వేతనం రూ.15 కోట్లకు మించకుండా పరిమితి విధించుకున్నారు. అయితే సంస్థకు చెందిన ఇతర ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల వేతనాలపై మాత్రం ఎలాంటి పరిమితి విధించలేదు.

click me!