నేటి నుంచే డబ్ల్యూఈఎఫ్ సదస్సు.. ముకేశ్ అంబానీ ఇలా

By sivanagaprasad kodatiFirst Published Jan 21, 2019, 12:05 PM IST
Highlights

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకున్నదన్న వార్తల మధ్య సోమవారం నుంచి దావోస్ వేదికగా ‘ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్)’ సదస్సు జరుగనున్నది. వివిధ దేశాల అధినేతలతోపాటు కార్పొరేట్ సంస్థల సీఈఓలు సదస్సులో పాల్గొననున్నారు. భారతదేశం నుంచి పాల్గొనే కార్పొరేట్ సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సతీ సమేతంగా హాజరు కానున్నారు.

ప్రతియేటా స్విట్జర్లాండ్‌లోని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సుల నిర్వహణకు వేదిక దావోస్‌. సోమవారం నుంచి సదస్సు ప్రారంభమవుతోంది. ఐదు రోజులు పాటు జరిగే ఈ సదస్సులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీతోపాటు 100 కార్పొరేట్ సంస్థల సీఈఓలు కూడా పాల్గొననున్నారు.

30 దేశాల అధినేతలు, మైక్రోసాఫ్ట్‌ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్లతోపాలు పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల సీఈఓలు పాల్గొంటున్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. 

ముకేశ్ అంబానీతోపాటు భారత్‌ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు గౌతమ్‌ ఆదానీ, ఆనంద్‌ మహీంద్రా, సునీల్‌ మిట్టల్‌, అజీమ్‌ప్రీమ్‌జీ తదితరులు హాజరవుతున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మాత్రం భార్య నీతా అంబానీ, కొడుకు ఆకాశ్‌, కూతురు ఇషాతో సహా హాజరవుతున్నారు.

జర్మన్‌ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌, ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహుతో సహా 30 దేశాల ప్రధానులు గానీ, అధ్యక్షులుగానీ ఈ సదస్సుకు హాజరు కానున్నారు. భారత్‌ నుంచి మధ్య ప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌, కేంద్ర మంత్రులు సురేశ్‌ ప్రభు, ఆంధ్ర ప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌, పంజాబ్‌ మంత్రి మన్‌ప్రీత్‌ బాదల్‌ హాజరవుతున్నారు. 

తమ దేశాల్లో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితులతో అమెరికా (షట్ డౌన్ కారణంగా) అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, బ్రిటిష్‌ ప్రధాని థెరిసా మే (బ్రెగ్జిట్ వ్యూహం ఖరారులో బిజీ) ఈ సదస్సుకు హాజరు కావడం లేదు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మళ్లీ సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని హెచ్చరికలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సదస్సు జరుగుతోంది. 

అదిదాస్, రినో టింటో, ఎంబ్రార్, ఆక్సా, సొసైటీ జనరేల్, టోటల్, అలియాంజ్, బేయర్, డచ్ బ్యాంక్, లుఫ్తాంసా, కేపీఎంజీ, సీమెన్స్, హిటాచీ, నొమురా, ఐకియా, అలీబాబా, క్రెడిట్ సూయిజ్, నెస్టెల్, నొవార్టీస్, బార్ క్లేస్, బీపీ, యూనీ లివర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిస్కో, డెల్, ఐబీఎం, మోర్గాన్ స్టాన్లీ, పెప్సికో, ప్ఫిజర్, కోకాకోలా, వీసా సంస్థల సీఈఓలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

వీటితోపాటు సీఐఐ వంటి భారత పారిశ్రామిక సంస్థలు సొంతంగా ఆయా రంగాల సీఈఓలతో విడివిడిగా భేటీ కానున్నాయి. ‘నాలుగో పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ నిర్మాణం’ అనే అంశంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చ జరగనున్నది.

‘ఇండియా అండ్‌ ది వరల్డ్‌’ అనే అంశంపైనా ఈ సదస్సులో ప్రత్యేక చర్చ జరగనున్నది. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లాస్ స్కవాబ్ స్పందిస్తూ నాలుగోతరం ప్రపంచీకరణ మానవ వనరుల కేంద్రీకరణగా సమగ్ర సుస్థిరాభివ్రుద్ది దిశగా సాగాలని ఆకాంక్షించారు. 

నాలుగోతరం పారిశ్రామిక విప్లవంలో టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులతో పెరుగుతున్న అనిశ్చితిని అధిగమించడంతోపాటు భౌగోళిక- ఆర్థిక, భౌగోళిక- రాజకీయ శక్తుల మధ్య పునరేకీకరణ జరుగాల్సి ఉన్నదని డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లాస్ స్కవాబ్ పేర్కొన్నారు. సదస్సులో పాల్గొనే వారు నిబద్ధతతో వ్యవహరించాలని సూచించారు. ఈ సదస్సులో 900కి పైగా పౌర సమాజ, 1700 మంది వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు పాల్గొననున్నారు. 

click me!