సబ్‌స్కైబర్లు, ఆదాయం నిశ్చింతగా జియో...టారిఫ్ పెంపు దిశగా ఎయిర్‌టెల్, వోడా

By sivanagaprasad kodatiFirst Published Jan 21, 2019, 10:56 AM IST
Highlights

65 శాతం త్రైమాసికం లాభాలతో దూకుడు మీదున్న రిలయన్స్ జియో తాజాగా టారిఫ్‌ల పెంచేందుకు సాహసించకపోవచ్చు. తాజాగా కొత్త కస్టమర్లు జత కలవడమే దీనికి కారణం. 400 మిలియన్ల కస్టమర్లు జత కలిసే వరకు జియో దూకుడు కొనసాగొచ్చు. 

భారీగా ఆదాయం పెరుగుదలతోపాటు అదనపు సబ్ స్క్రైబర్ల చేరికతో రిలయన్స్ జియో ప్రస్తుతం టారిఫ్ రేట్ల పెంపునకు వెనుకంజ వేస్తున్నది. సమీప భవిష్యత్‌లో వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్ టెల్ సంస్థల నుంచి రెవెన్యూను కొల్లగొట్టవచ్చునన్న అంచనా మధ్య రిలయన్స్ జియో టారిఫ్ రేట్లను పెంచడానికి వెనుకంజ వేస్తున్నది. 

ఇకముందు కూడా కస్టమర్లను పెంపొందించుకోవడంపైనే తమ ద్రుష్టి ఉంటుందని గోల్డ్‌మన్ సాచెస్,  సిటీ రీసెర్చ్, మోర్గాన్ స్టాన్లీ వంటి విశ్లేషణ సంస్థలతో రిలయన్స్ జియో ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు. ఇప్పటికే 280 మిలియన్ల కస్టమర్లు రిలయన్స్ జియోతో చేరిపోయారు. ఇది మార్కెట్ షేర్‌లో 24 శాతం. రిలయన్స్ జియో రెవెన్యూ 26 శాతం. 

ప్రస్తుతం కస్టమర్లను పెంచుకోవడంపైనే జియో కేంద్రీకరిస్తుందని ఇటీవల రిలయన్స్ త్రైమాసిక ఫలితాల వెల్లడి కార్యక్రమంలో పాల్గొన్న గోల్డ్ మాన్ సాచెస్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతం టెలికం రంగంలో ఆదాయాలు స్తంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అదీ కూడా రిలయన్స్ జియో ప్రకటించిన 400 మిలియన్ల సబ్ స్క్రైబర్లను చేరుకునే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నది. జియో రంగ ప్రవేశంతో టెలికం రంగ పరిశ్రమ పూర్తిగా కదిలిపోయింది. ఫ్రీ వాయిస్ కాల్స్, చౌక డేటా టారిఫ్స్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

గత గురువారం ప్రకటించిన రిలయన్స్ త్రైమాసికం ఫలితాల్లో ‘జియో’ 65 శాతం లాభాలను పెంచుకుని రూ.831 కోట్లకు చేరుకున్నది. దీనికి కారణం సబ్ స్క్రైబర్ల పెంపే. తత్ఫలితంగా భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు వచ్చే నెలాఖరులో ప్రకటించే ఆర్థిక ఫలితాల్లో నష్టాలు చూపే అవకాశాలు ఉన్నాయని టెలికం రంగ విశ్లేషకులు చెబుతున్నారు.  

అయితే గత రెండేళ్ల మాదిరిగా ప్రత్యేకంగా కస్టమర్లను పెంచుకోవడంపైనే రిలయన్స్ జియో కేంద్రీకరించకపోవచ్చునని టెలికం రంగ విశ్లేషకుల అంచనా. దీనివల్ల నష్టాలను పూడ్చుకునేందుకు వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్ టెల్ మరోదఫా టారిఫ్‌లు పెంచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

టారిఫ్‌ల పెంపుతో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థల నష్టాలు తగ్గుముఖం పట్టొచ్చు. కానీ రిలయన్స్ జియో దూకుడు ఎయిర్ టెల్, వొడాఫోన్ ఆశలపై నీళ్లు చల్లే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 
 

click me!