
భారత కార్పోరేట్ రంగంలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ ఆటో మాజీ ఛైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. దీనికి సంబంధించి బజాజ్ గ్రూప్ అధికారిక ప్రకటన చేసింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో శనివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారని బజాజ్ గ్రూప్ వెల్లడించింది. న్యూమోనియా, గుండె సంబంధిత సమస్యలతో ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
రాహుల్ బజాజ్ 1972లో బజాజ్ గ్రూప్ బాధ్యతలను స్వీకరించారు. దాదాపు 5 దశాబ్దాల పాటు బజాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలను ఆయన విజయవంతంగా నడిపించారు. దేశంలోని అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా రాహుల్ బజాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. టూ వీలర్స్ , త్రీ వీలర్స్ రంగంలో అనేక నూతన ఆవిష్కరణలకు కారణమైన బజాజ్ ఆటో .. రాహుల్ బజాజ్ సారథ్యంలో ఉచ్చస్థితికి చేరుకుంది. అంతేకాదు 2006 నుంచి 2010 వరకు రాహుల్ బజాజ్ రాజ్యసభ సభ్యుడిగా కూడా పని చేశారు.