సామాన్యుడికి భారంగా బంగారం ధరలు.. రెండేళ్లలో తులం పసిడి ఎంతంటే..?

By Sandra Ashok KumarFirst Published Jun 26, 2020, 11:40 AM IST
Highlights

కరోనా కష్టాలు.. చైనాతో భారతదేశానికి గల ఉద్రిక్తతల వల్ల మున్ముందు తులం బంగారం రెండేళ్లలో రూ.68 వేలు దాటుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది అమెరికా డాలర్ మీద రూపాయి మారకంపైనా ఆధారపడి ఉంది.

ముంబై: 24 క్యారట్ల (99.9 ప్యూరిటీ) 10 గ్రాముల బంగారం ధర రూ. 68 వేలు అనగానే గుండెలు అదిరిపోతున్నాయా? పసిడి ధర రూ.68 వేలకు చేరడం ఖాయమే కానీ ఇప్పుడప్పుడే కాదు. 18 నెలల నుంచి రెండేళ్లలో తులం బంగారం ధర రూ. రూ.65-68 వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌ (ఎంసీఎక్స్‌) మార్కెట్లో బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.48,589 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని చేరుకుంది. ఈ అప్‌ట్రెండ్ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.

భారత ఆర్థికవృద్ధి ఔట్‌లుక్‌ను ఐఎంఎఫ్ తగ్గించడంతోపాటు చైనాతో తాజాగా ఉద్రిక్తతలు, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ర్యాలీ చేసే అవకాశం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్న నిపుణులు దేశీయంగా బంగారం ధర పెరగడం ఖాయమని ఘంటాపథంగా చెబుతున్నారు.

ఈ క్రమంలో వచ్చే రెండేళ్లలో పది గ్రాముల పసిడి ధర  రూ.68వేల స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా బంగారం ర్యాలీ కొనసాగుతుందని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ కమోడిటీ విభాగపు హెడ్ కిశోర్ నార్నే పేర్కొన్నారు.   

ఆర్థిక రేటింగ్‌ సంస్థల ప్రతికూల రేటింగ్‌లు, చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాల ఫలితంగా బంగారం ధర రికార్డు స్థాయిలో దూసుకుపోవచ్చునన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే డాలర్‌ మారకంలో రూపాయి కదలికపై బంగారం ధరలు ఆధారపడి ఉంటాయని చెప్పారు.

also read స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఆస్తులపై షాకింగ్ న్యూస్...కానీ ! ...

కరోనా వైరస్‌ నానాటికీ విజృంభిస్తున్నా, బంగారం ధరలు మాత్రం కిందికి దిగిరావడం లేదు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు పసిడి ధర ఏకంగా రూ. 5000కు పైగా ఎగబాకింది. 

వచ్చే కొన్ని నెలల్లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని మోతీలాల్‌ ఓశ్వాల్‌ బ్రోకరేజ్‌ కమోడిటీ విభాగ అధిపతి కిశోర్‌ నార్నే పేర్కొన్నరు. కరోనాతో కాటుతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు ఎక్కువ సమయం పట్టవచ్చునన్నారు. 

దీంతో వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు మరో రెండేళ్లే సులభమైన పాలసీ విధానానికి కట్టుబడే అవకాశం ఉన్నదని కిశోర్‌ నార్నే చెప్పారు.  అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండటం కూడా పసిడి ధరలు మరింత పెరిగేందుకు దోహదం చేస్తాయన్నారు. 

మరోవైపు, కరోనా సృష్టిస్తున్న ఆర్థిక తుఫానుకు రూపాయి మారకం విలువ మునుపెన్నడూ చూడని రీతిలో పతనమయ్యే అవకాశం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫొరెక్స్ డిపార్టెమెంట్ మాజీ చీఫ్ వెంకట్ త్యాగరాజన్ అన్నారు. ఏప్రిల్‌ నెలలోనే ఓ డాలర్ మారకం విలువ రూ.76.91కు చేరుకున్న నేపథ్యంలో ఈ కామెంట్ ప్రాధాన్యం సంతరించుకుంది.

‘మునుపెన్నడూ చూడని రీతిలో భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు పతనం అవుతోంది. ఇందుకు అనుగుణంగానే రూపాయి విలువ పడిపోతుంది’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫొరెక్స్ డిపార్టెమెంట్ మాజీ చీఫ్ వెంకట్ త్యాగరాజన్ వ్యాఖ్యానించారు. ఎగుమతి దిగుమతుల వ్యాపారం రూపాయి మారకం విలువపై ఆధారపడి ఉంటుందన్న విషయం తెలిసిందే. 
 

click me!