ఒకప్పుడు ఏజెన్సీగా రిలయన్స్‌.. ఇప్పుడు దాని సొంతం

By rajesh yFirst Published Jul 19, 2019, 1:17 PM IST
Highlights
  • బ్రిటన్‌కు చెందిన చిన్నారుల ఆట వస్తువుల సంస్థ `హామ్‌లేస్‌`ను ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ రిలయన్స్ బ్రాండ్స్ టేకోవర్ చేయనున్నది. 
  • మొత్తం ఆ సంస్థను రూ. 580 కోట్లకు రిలయన్స్‌  దక్కించుకుంది.
  •  పిల్లల ఆటవస్తువులు తయారు చేయడంలో సూమారు 250 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హెచ్‌జీహెచ్‌ఎల్‌ సంస్థ.

ముంబై : బ్రిటన్‌ హామ్‌లేస్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీహెచ్‌ఎల్‌)సంస్థను రిలయన్స్‌ బ్రాండ్స్‌ కొనుగోలు చేసే ప్రక్రియ గురువారం పూర్తయ్యింది. మొత్తం ఆ సంస్థను రూ. 580 కోట్లకు రిలయన్స్‌  దక్కించుకుంది. పిల్లల ఆటవస్తువులు తయారు చేయడంలో సూమారు 250 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హెచ్‌జీహెచ్‌ఎల్‌ సంస్థ 18 దేశాలలో మొత్తం 167 స్టోర్లను కలిగి ఉంది. 

లండన్‌లో ఈ సంస్థకు ఉన్న ఏడంతస్తుల భవనంలో సుమారు 50 వేల రకాల ఆటబొమ్మలు అమ్మకానికి ఉంటాయి. ప్రతి సంవత్సరం దాదాపుగా 50 లక్షల మంది ఈ స్టోర్‌ను  సందర్శిస్తారు. హంకాంగ్‌ షేర్‌మార్కెట్‌లో లిస్ట్‌ అయిన సీ-బ్యానర్‌ ఇంటర్నేషనల్‌ హోల్గింగ్స్‌ నుంచి రిలయన్స్‌ ఈ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. 

ఇప్పటివరకు  హెచ్‌జీహెచ్‌ఎల్‌ సంస్థకు భారత్‌లో రిలయన్స్‌ బ్రాండ్స్‌ ఫ్రాంఛైజీగా ఉంది. గత కొన్నేళ్లుగా పిల్లల ఆటవస్తువుల అమ్మకాలలో రిలయన్స్‌ బ్రాండ్స్‌ లాభాల బాటలో నడుస్తోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు అనుబంధ సంస్థ రిలయన్స్‌ బ్రాండ్స్‌ దేశం మొత్తంమీద 420 స్టోర్‌లను నిర్వహిస్తున్నది.

హామ్ లెస్ చిన్నారుల సంతోషాలకు మారుపేరుగా నిలిచింది. ఈ సంస్థ అసలు పేరు హై హోల్ బోర్న్. 1991లో అగ్నికి ఆహుతైంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దీనిపై బాంబులేశారు. బ్రిటన్ రాజ కుటుంబానికి అందిస్తున్న సేవలు, వస్తువులు సరఫరా చేస్తున్న సంస్థలకు రాయల్ కోర్టు ‘రాయల్ వారంట్ ఆఫ్ అపాయింట్ మెంట్’ అందజేస్తుంది. 1938లో క్వీన్ మేరీ, 1955లో రాణి ఎలిజబెత్ హయాంలో ఈ వారంట్లను హామ్ లెస్ అందుకుంది. 

1760లో సేవలు ప్రారంభించిన హామ్ లెస్ సంస్థ శాఖను యూరప్ బయట జోర్డాన్ లోని అమ్మాన్ నగరంలో 2008లో స్థాపించారు. దక్షిణాసియాలో భాగంగా ముంబైలో 2010లో తొలి ఔట్ లెట్ కొలువు దీరింది 

2003లో బౌగూర్ గ్రూప్, తర్వాత ఐస్ లాండిక్ బ్యాక్ ల్యాండ్స్ బంకీ, 2012లో ఫ్రాన్స్ టాయ్ రిటైలర్ గ్రూపీ లుడెండో కొనుగోలు చేసింది. అటుపై చైనా సంస్థ సీ బ్యానర్ ఇంటర్నేషనల్ సొంతం చేసుకున్న హామ్ లెస్ తాజాగా భారత్ దిగ్గజం రిలయన్స్ చేతికి చిక్కింది. 

హామ్‌లేస్‌ సంస్థను స్వాధీనం చేసుకోవడానికి రిలయన్స్ 67.96 బ్రిటన్ పౌండ్ల విలువైన పెట్టుబడితో బ్రిటన్‌లో స్పెషల్ పర్పస్ వెహికల్ కంపెనీని స్థాపిస్తామని బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. 250 ఏళ్ల చరిత్ర గల హామ్ లెస్ ఇప్పటివరకు పలు సంస్థల చేతులు మారింది. 2015లో చైనాకు చెందిన సీ. బ్యానర్ ఇంటర్నేషనల్ దీన్ని సొంతం చేసుకున్న తర్వాతే హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్టయింది. అయితే నష్టాల బాటలో పయనిస్తున్నందునే సీ బ్యానర్ ఇంటర్నేషనల్ సంస్థ.. హామ్ లెస్‌ను విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

click me!