
ప్రతి నెల ఒకటో తేదీన మీ ఆదాయంతో పాటు మీ రోజు జీవితాన్ని ప్రభావితం చేసే ఎన్నో మార్పులు కనిపిస్తుంటాయి. ఇందులో బ్యాంకింగ్ సేవల నుండి ఎల్‌పిజి సిలిండర్ ధరల వరకు మార్పులు ఉంటాయి. ఈసారి గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా 1 మార్చి 2022 నుండి మరికొన్ని ప్రత్యేక మార్పులు జరగబోతున్నాయి, ఇవి నేరుగా మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు.
ఎల్‌పీజీ సిలిండర్ ధర ప్రతి నెలా ఒకటో తేదీన మారుతుండడం గమనార్హం . గ్యాస్ ధరలు నేరుగా సామాన్యుల వంటగదికి సంబంధించినవి కాబట్టి, ప్రజల దృష్టి ఎక్కువగా దానిపైనే ఉంటుంది. గత కొన్ని నెలలుగా ఎల్‌పిజి సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పు లేదు, కాబట్టి దాని ధరలో 1 మార్చి 2022న మార్పు వచ్చే అవకాశం ఉంది. మార్చి 1న సిలిండర్ ధరలు పెరుగుతాయా లేదా స్థిరంగా ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇండియా పోస్ట్
ఐపిపిబి(IPPB) అంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ డిజిటల్ సేవింగ్స్ ఖాతా పై క్లోజర్ ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభించింది. మీకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతా ఉన్నట్లయితే, మీరు ఈ ఛార్జీని చెల్లించాలి. ఈ ఛార్జీ రూ.150 కాగా, జీఎస్టీని ప్రత్యేకంగా చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ నుండి ఈ కొత్త రూల్ 5 మార్చి 2022 నుండి అమలు చేయనుంది.
పెన్షనర్లకు తగ్గింపు
పింఛనుదారుల లైఫ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ సమర్పించడానికి ఫిబ్రవరి 28 చివరి తేదీ. అంటే మార్చి నెల నుంచి ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపు ముగియనుంది. పెన్షనర్లు ప్రతినెల పింఛను పొందడం కోసం పింఛనుదారులు లైఫ్ సర్టిఫికేట్ మార్చి 1 లోపు సమర్పించడం అవసరం. సాధారణంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి ప్రతి సంవత్సరం చివరి తేదీ నవంబర్ 30, అయితే ప్రభుత్వ పెన్షనర్లకు పెద్ద ఉపశమనం ఇస్తూ, ఈ సంవత్సరం తేదీని రెండుసార్లు పొడిగించారు. తుది గడువులోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించకుంటే పింఛన్ నిలిచిపోతుంది. మీరు ఇంట్లో కూర్చొని కూడా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. దీని కోసం మీరు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను రూపొందించాల్సి ఉంటుంది.
డిజిటల్ చెల్లింపుల్లో మార్పులు
డిజిటల్ చెల్లింపుల్లో భారీ మార్పులకు ఆర్‌బీఐ సిద్ధమైంది. ప్రేప్రైటరీ క్యూఆర్(QR)కోడ్ వినియోగదారులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇంటర్‌ఆపరబుల్ QR కోడ్‌లకు తరలిస్తారు. ఈ బదిలీ ప్రక్రియను మార్చి 31, 2022లోపు పూర్తి చేయాలి. దీనితో పాటు, ఏ PSO ఏదైనా చెల్లింపు లావాదేవీకి న్యూ ప్రేప్రైటరీ కోడ్‌ను ప్రవేశపెట్టదని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.
ఏటీఎంలలో నగదు నింపేందుకు నిబంధనలు
ఏటీఎంలలో నగదు నింపే నిబంధనలు మార్చిలో మారనున్నాయి . విశేషమేమిటంటే ఏటిఎంలో నగదు నింపడానికి మాత్రమే లాక్ క్యాసెట్ల వినియోగాన్ని అమలు చేయడానికి బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చివరి తేదీని మార్చి 2022 వరకు పొడిగించింది. ప్రస్తుతం, చాలా వరకు ఏటిఎంలు (ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్లు) ఓపెన్ క్యాష్ టాప్-అప్ ద్వారా లేదా నగదును ఏటిఎంలోకి ఇంజెక్ట్ చేయడం ద్వారా నగదుతో నింపబడతాయి. ఏటీఎంలలో నగదును పంపిణీ చేసే విధానాన్ని తొలగించేందుకు, ఏటీఎంలలో నగదు నింపే సమయంలో లాక్ చేయగల క్యాసెట్లను మాత్రమే ఉపయోగించాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది.