జెట్​ ఎయిర్​వేస్​​ వ్యవస్థాపకుడిపై మనీ లాండరింగ్ కేసు...

By Sandra Ashok Kumar  |  First Published Mar 5, 2020, 2:25 PM IST

జెట్​ ఎయిర్​వేస్​ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్​ నరేశ్​ గోయల్​పై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) అధికారులు మనీ లాండరింగ్​ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
 


న్యూఢిల్లీ: జెట్​ ఎయిర్​వేస్​ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్​ నరేశ్​ గోయల్​పై ఎన్‌ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) అధికారులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయన ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆస్తుల వివరాలపై ఆరా తీశారు. 

గతంలో విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) కింద ఈడీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేసి ప్రశ్నించారు. తాజాగా ముంబైలోని ఓ ట్రావెల్ సంస్థను గోయల్​ మోసం చేసినట్లు అందిన ఫిర్యాదుతో ముంబై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. గోయల్ నివాసంలో బుధవారం రాత్రి అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. 

Latest Videos

undefined

also read జీతం పొందే ఉద్యోగులకు చేదు వార్త... ఇపిఎఫ్ వడ్డీరేటు తగ్గిస్తూ నిర్ణయం..

అనంతరం గోయల్​పై కేసు నమోదు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. గతంలోనూ గోయల్​, ఆయన కుటుంబ సభ్యులపై ఈడీ అధికారులు ఇటువంటి దాడులే నిర్వహించారు. గతేడాది ఆగస్టులో విదేశీ బ్యాంకు ఖాతాలకు సంబంధించి ముంబై, ఢిల్లీలోని గోయల్‌ నివాసాలు, సంస్థల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. 

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం వల్ల గతేడాది ఏప్రిల్​లో జెట్ ఎయిర్‌వేస్‌ సర్వీసులు నిలిపి వేసింది. అంతకుముందు మార్చిలో గోయల్.. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్‌వేస్‌ నుంచి భారీగా నిధులను మళ్లించినట్లు తెలుస్తోంది.

సంస్థ నిధులను దారి మళ్లించారన్న ఆరోపణలను కూడా నరేశ్ గోయల్ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు జెట్ ఎయిర్వేస్ సంస్థ ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేకంగా అడిటింగ్ నిర్వహించనున్నట్లు గతేడాది సెప్టెంబర్ నెలలోనే ప్రకటించారు. 

also read ఆన్‌లైన్‌లో టాటా నుండి స్పెషల్ లగ్జరీ కాఫీ...

దారి మళ్లించిన నిధులను విదేశీ కంపెనీలకు తరలించారని నరేశ్ గోయల్‌పై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వతంత్ర్య ఆడిటింగ్‌తో మరిన్ని అంశాలు బయటకు వస్తాయని ఈడీ భావించింది. ఇదిలా ఉంటే విదేశాలకు వెళ్లేందుకు నరేశ్ గోయల్ దంపతులు చేసిన ప్రయత్నాలకు ఇమ్మిగ్రేషన్ విభాగం గతేడాది మే 25న అడ్డుకట్ట వేసింది. 

దుబాయి మీదుగా లండన్ బయలుదేరి వెళ్లేందుకు ఎమిరేట్స్ ఎయిర్వేస్ సంస్థ విమానం ఈకే 507 విమానంలో నరేశ్ గోయల్ దంపతులు ఎక్కి కూర్చున్నారు. ఆ విమానాన్ని పార్కింగ్ స్థలానికి తీసుకొచ్చి గోయల్ దంపతులను దింపి వేశారు. వారి వెంట నాలుగు భారీ సూటుకేసులు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
 

click me!