దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని రిటైల్ షాపుల సమ్మేళనం ఖాన్ మార్కెట్ అదరగొడుతున్నది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రిటైల్ ప్రాంతాల్లో 20వ స్థానాన్ని సంపాదించుకున్నదని కుష్మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక వెల్లడించింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌లో రిటైల్ షాపుల అద్దెలు అదిరిపోతున్నాయి. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రిటైల్ లొకేషన్లలో ఖాన్ మార్కెట్ 20వ స్థానంలో నిలిచింది. 2019 సంవత్సరానికి గాను గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్‌ఫీల్డ్ విడుదల చేసిన ‘ప్రపంచవ్యాప్తంగా ప్రధాన వీధులు-2019’ నివేదికలో ఖాన్ మార్కెట్ వార్షిక అద్దె చదరపు అడుగుకు 243 డాలర్లు (దాదాపు రూ.17,500)గా పలికింది.
గతేడాది ఢిల్లీ ఖాన్ మార్కెట్ లోని చదరపు అడుగు రెంట్ 237 డాలర్లే ఉన్నా, ఈసారి మరో ఆరు డాలర్లు ఎగబ్రాకినట్లు సర్వేలో తేలింది. దీంతో నిరుడు 21వ స్థానంలో ఉన్న ఖాన్ మార్కెట్.. ఈ ఏడాది మరో స్థానం మెరుగు పర్చుకుంది.
undefined
also read ఆర్‌కామ్ దివాళా: అనిల్ అంబానీ రాజీనామా తిరస్కరణ
ఈ ఏడాది రెండో త్రైమాసికం (ఏప్రిల్-జూన్) అద్దెల ఆధారంగా ఈ జాబితాను కుష్మన్ అండ్ వేక్‌ఫీల్డ్ రూపొందించాయి. ప్రపంచవ్యాప్తంగా 68 ప్రముఖ దేశాల్లోగల 448 ప్రాంతాల్లోని అద్దెలను నిర్వాహకులు పరిశీలించారు. ఢిల్లీలో అత్యుత్తమ షాపింగ్ మాల్స్ కొరత కనిపిస్తున్నదని, అందుకే అంతర్జాతీయ బ్రాండ్లు ఇక్కడకు బారులు తీరుతున్నాయని కుష్మన్ అండ్ వేక్‌ఫీల్డ్ తెలిపింది.
ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్), ముంబై, బెంగళూరుల్లోనూ అద్దెలకు డిమాండ్ ఉందని, గతంతో పోల్చితే స్వల్పంగా పెరిగాయని స్పష్టం చేసింది. చెన్నై, పుణె, కోల్‌కతా వంటి ఇతర నగరాలకూ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతున్నదని, ఇక్కడ కూడా అంతర్జాతీయ సంస్థలు తమ ఔట్‌లెట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాయని వివరించింది. దీంతో అద్దెలు పుంజుకుంటున్నాయని గుర్తుచేసింది.
ఇకపోతే ఆహార, శీతల పానీయాలు, వస్త్ర దుకాణాల యాజమాన్యాలు ఎక్కువ మొత్తంలో అద్దెలు చెల్లిస్తున్నారని తేలింది. యాక్ససరీస్, హైపర్‌మార్కెట్లూ భారీగానే తెరుచుకుంటున్నాయని చెప్పిన సర్వే.. ఈ-కామర్స్ రిటైలర్లు ఆన్‌లైన్‌పైనేగాక భౌతిక మార్కెట్లపైనా దృష్టి సారిస్తున్నారని, దీంతో ప్రధాన వీధుల్లో ఈ-కామర్స్ సంస్థల కార్యాలయాలు, ఔట్‌లెట్లూ వెలుస్తున్నాయని వివరించింది.
also read గూగుల్ ముందు నిరసన.. కారణమేమిటంటే?
హాంకాంగ్‌లోని కాజ్‌వే బే అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఇక్కడ ఒక్క చదరపు అడుగు అద్దె ఏకంగా 2,745 డాలర్లు (రూ.1.97 లక్షలకుపైగా) పలుకుతున్నది. టాప్-5లో కాజ్‌వే బే తర్వాత అమెరికాలోని న్యూయార్క్ నగరంలోగల అప్పర్ ఫిఫ్త్ అవెన్యూకు డిమాండ్ ఎక్కువగా లభిస్తున్నది. తాజా జాబితాలో ఇది రెండో స్థానంలో ఉండగా, ఇక్కడ చదరపు అడుగు అద్దె 2,250 డాలర్లుగా ఉన్నది.
మూడో స్థానంలో బ్రిటన్ రాజధాని లండన్‌లోని న్యూ బాండ్ స్ట్రీట్ (1,714 డాలర్లు) ఉండగా, నాలుగో స్థానంలో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని అవెన్యూ డెస్ చాంప్స్ లిసీస్ (1,478 డాలర్లు), ఐదో స్థానంలో ఇటలీలోని మిలాన్‌లోగల వయా మాంటెనాపోలియన్ (1,447 డాలర్లు) ఉన్నాయి.