ఒకనాడు ఐటీ ఉద్యోగం అంటే మంచి జీతం, స్థిరమైన ఉపాధి అనే భావన చాలా మందిలో ఉండేది. కొంత కాలంగా ఐటీ ఉద్యోగులకు కొత్త భయాలు నెలకొన్నాయి. ఎప్పుడు ఉద్యోగం పోతుందోననే అభద్రత భావం పెరిగిపోతోంది. ఇంతకీ ఐటీ రంగంలో ఏం జరుగుతోంది? ఉద్యోగులను ఎందుకు తొలగిస్తున్నారన్న విషయమై పరిశీలిద్దాం.
న్యూఢిల్లీ: ఇటీవలి వరకూ దేశీయ ఆటోమొబైల్ రంగంలో మందగమనంతో భారీసంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవలసిన పరిస్థితి కనిపించింది. దీనిపై అన్ని వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పుడు ఇదే తరహాలో ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు చర్చనీయాంశం అవుతోంది.
వ్యయాలు తగ్గింపు లేదా టెక్నాలజీ చేంజ్ ఫలితమో కానీ ఉద్యోగాల కోతను ప్రకటిస్తున్న కంపెనీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ పరిస్థితి ఐటీ నిపుణులను, ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్ధులను, వారి తల్లితండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది.
also read ఇతర మెట్రో నగరాల కంటే మన హైదరాబాద్ బెస్ట్
ఇప్పటికే ఐటీ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులపై ఒత్తిడి పెరిగి పోయేందుకూ తావిస్తోంది. ఐటీ రంగంలో వచ్చే ఏడాదిలో 30 వేల నుంచి 40వేల మంది మధ్యస్థాయి ఉద్యోగులను కంపెనీలు తొలగించే అవకాశం ఉందంటూ ఐటీ రంగ నిపుణుడు, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ మోహన్ దాస్ పాయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ ఈ నెల మొదటి వారంలో ఉద్యోగాల కోతను ప్రకటించింది. వచ్చే కొద్ది నెలల్లో 10వేల నుంచి 12 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ సీఈఓ బ్రియాన్ హంఫెరీస్ స్పష్టం చేశారు. ఏ దేశంలో ఎంతమందిని తొలగిస్తారనేది చెప్పకున్నా.. మనదేశంపై అధిక ప్రభావం ఉంటుందనేది విస్పష్టం.
కాగ్నిజెంట్ ఉద్యోగుల్లో దాదాపు 70 శాతం మనదేశంలోనే పనిచేస్తున్నారు. కొన్ని విభాగాల నుంచి తాము వైదొలుగుతున్నట్లు, అందువల్ల ఉద్యోగాల కుదింపు అనివార్యంగా మారినట్లు కాగ్నిజెంట్ వివరించింది. ఇక దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 నుంచి 150 మిలియన్ డాలర్ల మేరకు వ్యయాలను తగ్గించుకోవాలని యోచిస్తోంది. అందులో భాగంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని పరిశ్రమ వర్గాల విశ్లేషణ.
పర్సనల్ కంప్యూటర్లు, ప్రింటర్లు సరఫరా చేసే సంస్థ హెచ్‌పీ ‘వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ’లో భాగంగా వచ్చే మూడేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఏడు వేల నుంచి తొమ్మిది వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇందులో మనదేశంలో 500 ఉద్యోగాలు ఉంటాయని అంచనా.
అమెరికాకు చెందిన ‘వుయ్‌వర్క్‘ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 4,000 మందిని తొలగించటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ ఛైర్మన్ మార్సెలో క్లారీ తాజాగా ఉద్యోగులకు రాసిన లేఖలో సూచనప్రాయంగా వెల్లడించారు.
వుయ్ వర్క్ సంస్థలో మనదేశంలో పనిచేస్తున్న ఆ కంపెనీ సిబ్బంది ఉంటారనేది విస్పష్టం. హైదరాబాద్‌తో సహా ముంబై, బెంగళూరు, నోయిడా, గురుగ్రామ్, పుణె నగరాల్లో ‘వుయ్‌వర్క్’ కార్యకలాపాలు సాగిస్తోంది.
జొమాటో రెండు నెలల క్రితం గురుగ్రామ్‌లోని తన కేంద్ర కార్యాలయంలో 550 మంది ఉద్యోగులను తొలగించింది. ఆటోమేషన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో సామర్థ్యాన్ని పెంచుకుంటున్నందున ఉద్యోగుల సంఖ్య తగ్గింపు తప్పనిసరవుతోందని జొమాటో వివరించింది.
ఐటీ రంగంలో ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయంలో సంబంధిత వర్గాల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా ఐటీ కంపెనీల లాభాలపై ఒత్తిడి పెరిగిపోతోంది. అందువల్ల వ్యయాలు తగ్గించుకోవటం తప్పనిసరిగా మారింది. అందువల్ల పెద్ద సంఖ్యలో బెంచ్ సిబ్బందిని, ప్రాజెక్టులు లేని విభాగాల్లో సిబ్బందిని కొనసాగించటానికి ఇష్టపడటం లేదు.
ఇక కొన్ని సంస్థలు ఇంక్రిమెంట్లు తగ్గించటం లేదా వాయిదా వేయటానికి ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. మనదేశంలో ఐటీ పరిశ్రమ దాదాపు మూడు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటోంది.
90వ దశకంలో ప్రారంభమైన ఎన్నో కంపెనీలు భారీగా విస్తరించి స్థిరీకరణ సాధించాయి. ఒక స్థాయికి చేరిన తర్వాత మధ్యస్థాయిలో పర్యవేక్షణ బాధ్యతల్లో ఉండే సీనియర్ ఉద్యోగుల అవసరం అంతగా ఉండదు. అందువల్ల పలు ఐటీ కంపెనీలు అటువంటి ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ మోహన్ దాస్ పాయ్ పేర్కొన్నారు.
ఇక సాంకేతిక పరిజ్ఞానంలో శరవేగంగా వస్తున్న మార్పులు కూడా ఉద్యోగుల తొలగింపునకు కారణం అవుతోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆటోమేషన్, మెషీన్ లెర్నింగ్, 5జీ... వంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో వస్తుండటంతో పలు సంస్థల్లో గతంలో మాదిరిగా పెద్ద సంఖ్యలో ఉద్యోగుల అవసరం ఉండటం లేదు.
also read మార్చిలోగా 1000 చోట్ల క్లౌడ్ కిచెన్లు : స్విగ్గీ
సాంకేతిక మార్పుల వల్ల కొత్తరకం ఉద్యోగాలు లభిస్తాయి. అదే సమయంలో పాత ఉద్యోగుల అవసరం అంతగా ఉండదు. అందుకే తొలగింపు అనివార్యం అవుతోందని స్థానిక ఐటీ వర్గాలు వివరిస్తున్నాయి. ఐటీ రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా సరికొత్త నైపుణ్యాలు సమకూర్చుకున్న విద్యార్ధులకైనా, ఐటీ ఉద్యోగులకైనా ఉద్యోగాల కొరత లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతిక పరిజ్ఞానానికి, సేవలకు ఎంతో గిరాకీ లభిస్తోంది,
నూతన టెక్నాలజీల విభాగంలో మనదేశంలోనే సమీప భవిష్యత్తులో ఒక లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, అటువంటి నైపుణ్యాలు ఉన్నవారికి ఎన్నో ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి- అని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
నైపుణ్యాలు పెంచుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా తయారయితే సరే, కానీ వెనుకబడిన వారిని ‘తొలగింపు’ భయం వెంటాడుతోందని తెలుస్తోంది. ఈ పరిస్థితులకు తగ్గట్లుగా నిపుణులను సన్నద్ధం చేసేందుకు విద్యా సంస్థలు, ఐటీ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలు కృషి చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.