డియోర్ బ్యాగుల తయారీకి దాని ధరలో 20 శాతం మాత్రమే ఖర్చవుతుంది. డియోర్ ప్రొడక్షన్ యూనిట్లపై ఇటలీ పోలీసులు జరిపిన దాడిలో ఈ విషయం బయటపడింది.
డియోర్ హ్యాండ్‌బ్యాగ్‌లు అసలైన హస్తకళ, లగ్జరీకి మారుపేరు. అందువల్ల చాలా మంది డియోర్ హ్యాండ్‌బ్యాగ్‌ల గురించి కలలు కంటుంటారు. కానీ నివేదికల ప్రకారం, డియోర్ బ్యాగుల తయారీకి దాని ధరలో 20 శాతం మాత్రమే ఖర్చవుతుందట. తాజాగా డియోర్ ప్రొడక్షన్ యూనిట్లపై ఇటలీ పోలీసులు జరిపిన దాడిలో ఈ విషయం బయటపడింది.
డియోర్, LVMH గ్రూప్ యాజమాన్యంలోని ఫ్యాషన్ బ్రాండ్ బ్యాగ్‌లను కేవలం $57డాలర్లకి (సుమారు 5వేలు) తయారు చేస్తుంది. కానీ వీటిని $2,780 డాలర్లకు అమ్ముతున్నారు. అంటే కాంట్రాక్టర్లు తయారు చేసిన బ్యాగుకు డియోర్ చెల్లించిన ధర రూ.4700 అయితే అమ్మే ధర రూ.2,32,400.
అదే విధంగా, మరో లగ్జరీ బ్రాండ్ అర్మానీ కూడా ఇదే పని చేస్తున్నట్లు కనుగొన్నారు. కాంట్రాక్టర్లకు ఒక బ్యాగ్‌కి $99(సుమారు రూ.8500) చెల్లిస్తూ... వారి స్టోర్లలో $1,900 (సుమారు రూ.లక్షన్నర) కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.
విశ్రాంతి లేకుండా పనిచేసే కార్మికుల విచారణలో కూడా ఈ విషయం తేలింది. ఇక్కడ దారుణమైన పని పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగులు రాత్రింబవళ్లు పనిచేసేలా ఎలక్ట్రానిక్ డేటాను వినియోగించినట్లు విచారణలో తేలింది. చాలామంది కార్మికులు చైనా అక్రమ వలసదారులు, సరైన పత్రాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నారు. ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేయడానికి, గ్లూయింగ్ & బ్రషింగ్ మెషీన్లపై సేఫ్టీ డివైజెస్ తొలగించారు. ఉత్పత్తిలో ఈ ఖర్చు తగ్గింపు కూడా అధిక లాభాల మార్జిన్లను నిర్వహించడానికి డియోర్‌కు సహాయపడింది.
ఈ నేపథ్యంలో ఇటలీ న్యాయవ్యవస్థ.. డియోర్ & అర్మానీల రెండు ప్రోడక్ట్ యూనిట్లను ఏడాది పాటు కోర్టు పరిధిలో ఉంచాలని ఆదేశించింది. ఎక్కువ లాభాలను ఆర్జించడానికి కార్మిక చట్టాలను ఉల్లంఘించారని పేర్కొంది. కార్మికులు పగలు, రాత్రి దోపిడీకి గురవుతున్నారని, వారికి ఆరోగ్య, భద్రతా ప్రమాణాలు, పని గంటలు, న్యాయమైన వేతనాలను దక్కలేదని న్యాయస్థానం ఉత్తర్వుల్లో పేర్కొంది.