ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్: 2020-21లో ఉద్యోగుల వేతనాల పెంపు...

By Sandra Ashok Kumar  |  First Published Mar 5, 2020, 11:48 AM IST

ఆర్థిక మాంద్యం ప్రభావం ఉద్యోగుల వేతనాల పెరుగుదలపై గణనీయంగానే పడనున్నది. గతేడాదికంటే తక్కువగా 7.8 శాతం మాత్రమే పెరుగనున్నది. రియాల్టీ, టెలికం రంగాల్లో మరీ పేలవంగా ఉంటుందని డెలాయిట్‌ ఇండియా అధ్యయనంలో వెల్లడైంది.
 


న్యూఢిల్లీ : దేశంలో నెలకొన్న మాంద్యంతో కూడిన సంక్షోభం ఉద్యోగుల వేతన పెంపునపై తీవ్ర ప్రతికూలతను పెంచుతుందని ఓ సర్వేలో తేలింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)లో కేవలం 7.8 శాతం మాత్రమే వేతన పెంపు ఉండొచ్చని డెలాయిట్‌ ఇండియా నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. కంపెనీలపై లాభదాయక ఒత్తిళ్లు, ఆర్థిక మందగమనం వంటి కారణాలతో అంతకుముందు ఏడాదితో పోలిస్తే వేతన పెరుగుదలలో తగ్గుముఖం పట్టిందని తెలిపింది. 

2019-20లో ఉద్యోగుల వేతనాలు సగటున 8.2 శాతం మేర పెరిగాయని డెలాయిట్ నివేదిక వెల్లడించింది. ఈసారి వేతన వృద్ధి 40 బేసిస్‌ పాయింట్లు తక్కువగా నమోదవుతుందని అంచనా వేసింది. 'వర్క్‌ఫోర్స్‌ అండ్‌ ఇంక్రిమెంట్‌ ట్రెండ్స్‌ సర్వే' పేరుతో పలు కంపెనీలను అధ్యయనం చేసింది. 

Latest Videos

undefined

also read కరోనా ఎఫెక్ట్: పెరసిటామాల్ పాటు మరో 25 ఇతర మందులపై బ్యాన్...

ఈ సర్వేలో పాల్గొన్న 50 శాతం కంపెనీలు 2020-21లో వేతనాలు 8 శాతంలోపు పెరుగుతాయని తెలిపాయి. కేవలం 8 శాతం కంపెనీలు మాత్రం 10 శాతం పైగా వేతన పెంపు ఉంటుందని అభిప్రాయపడ్డాయి. ఇక 30 శాతం కంపెనీలు వేతన పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. 

ఇక మౌలిక, నిర్మాణ రంగం, బ్యాంకింగేతర కంపెనీలు, టెలికాం రంగాల్లో వేతన పెంపు తక్కువగా ఉంటుందని డెలాయిట్ నివేదిక పేర్కొంది. వైవిధ్యం, సామర్ధ్యం ఆధారంగా కంపెనీలు వ్యయ బడ్జెట్‌లను నిర్వహిస్తున్నాయని తెలిపింది.

పలు రంగాల 300 కంపెనీల హెచ్‌ఆర్‌ ప్రతినిధులను పలుకరించి ఈ సర్వే నివేదికను రూపొందించినట్టు డెలాయిట్‌ తెలిపింది. ఇందులో కీలకమైన ఏడు రంగాలు, 20 ఉప రంగాల భాగస్వామ్యం ఉన్నట్లు పేర్కొంది. గత కొన్ని ఏండ్లుగా వేతన పెంపునపై తీవ్ర చర్చ జరుగుతుందని డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ అనద్‌ఒరుప్‌ ఘోష్‌ అన్నారు.  

వేతన పెంపు అంశంలో కంపెనీ వ్యయ నిష్పత్తులపై బోర్డు గదిలో చాలా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఇప్పటికే అమాంతం పెరిగిన ధరలకు వచ్చే జీతాలకు సంబంధం లేకుండా పోవడంతో ప్రజల కొనుగోలు శక్తి భారీగా క్షీణించింది.

also read కరోనా వైరస్ అరికట్టేందుకు ఫేస్‌బుక్‌ సంచలన నిర్ణయం...

దీనికి తోడు ఆర్థిక మాంద్యం దెబ్బతో పలు కంపెనీలు ఉద్యోగుల జీతాల పెంపునకు కోత పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయన్న నివేదికలు సామాన్యులను ఆందోళనకు గురి చేస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు.

దేశంలో వినిమయం తగ్గుతూ డిమాండ్‌ పడిపోతుండటంతో కంపెనీలు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయని.. ఈ ప్రభావం వేతన పెంపునపై పడుతుందని అభిప్రాయపడుతున్నారు. సంఘటిత రంగంలోని కంపెనీలు ఈ ఏడాది సగటున 9.1 శాతం జీతాల వృద్ధిని మాత్రమే ప్రకటించే అవకాశం ఉందని ఏయాన్‌ పిఎల్‌సి సంస్థ ఇటీవల ఓ అధ్యయన నివేదికలో తెలిపింది. 

ఇది దాదాపు దశాబ్ద కాల కనిష్టమని పీఎల్సీ విశ్లేషించింది. 2009 తరువాత కంపెనీల జీతాల సగటు పెంపు ఇంత కనిష్టానికి చేరడం ఇదే తొలిసారి అని సంస్థ తెలిపింది. జీతాల పెంపు అంతకుముందు 2018లో 9.5 శాతం, 2019లో 9.3 శాతం మేర ఉన్నట్టు సంస్థ తెలిపింది.
 

click me!