కరోనా ఎఫెక్ట్: పెరసిటామాల్ పాటు మరో 25 ఇతర మందులపై బ్యాన్...

By Sandra Ashok KumarFirst Published Mar 5, 2020, 10:42 AM IST
Highlights


దేశీయంగా కరోనా వైరస్ కేసులు నమోదవుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఔషధ ఎగుమతులను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పారాసిటమాల్‌, మరో 25 రకాల ఉత్పత్తులపై ఆంక్షలు విధించింది.
 

న్యూఢిల్లీ: దేశంలోనూ కరోనా వైరస్‌ కేసులు నమోదవుతుండటంతో మోదీ సర్కారు అప్రమత్తమైంది. పారాసిటమాల్‌తో పాటు మరో 25 ఇతర ఔషధాల ఎగుమతులపై మంగళవారం ఆంక్షలు పెట్టింది. ఎక్కడా, ఎటువంటి మందుల కొరత రాకుండా కనీస ఔషధాల ఎగుమతుల్నీ ఆపేయాలని కేంద్రం ఈ జాగ్రత్తలు తీసుకున్నది.

అలాగే మెట్రోనిడజోల్‌ వంటి యాంటీబయాటిక్స్‌, బ్యాక్టీరియా, వివిధ ఇన్ఫెక్షన్ల బారినపడకుండా వినియోగించే పలు రకాల మందులు, విటమిన్‌ బీ1, బీ6, బీ12 ఆధారిత ఔషధాలపైనా తక్షణమే ఆంక్షలు అమల్లోకి వస్తాయని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) ప్రకటించింది.

also read కరోనా వైరస్ అరికట్టేందుకు ఫేస్‌బుక్‌ సంచలన నిర్ణయం...

టినిడజోల్‌, సైక్లోవియర్‌, ప్రొజెస్టిరాన్‌, క్లోరాఫెనికాల్‌, ఆర్నిడజోల్‌, నియోమైసిన్‌, సిలిండమైసిన్‌ సాల్ట్స్‌ ఫార్ములేషన్లపైనా ఆంక్షలు వర్తిస్తాయి. కరోనా తీవ్రత దృష్ట్యా గత నెలలోనే 12 ఏపీఐలు, ఫార్ములేషన్ల ఎగుమతులపై ఆంక్షలు విధించాలని డీజీఎఫ్‌టీని ఔషధశాఖ కోరింది.

పరిస్థితులు మరింత దిగజారుతున్న సంకేతాలు రావడంతో ఇప్పుడు ఏకంగా 26 రకాల ఏపీఐలు, ఫార్ములాలపై ఆంక్షల్ని తెచ్చారు. నిజానికి జనరిక్‌ ఔషధాల తయారీలో భారత్‌దే అగ్రస్థానం. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న జనరిక్‌ ఔషధాల సరఫరాలో భారత్‌ వాటా 20 శాతంగా ఉన్నది.

అయితే వీటి తయారీకి కావాల్సిన ముడి పదార్థాల్లో మూడింటా రెండు వంతులు చైనా నుంచే వస్తున్నాయి. మనదేశ ఏపీఐ దిగుమతులు ఏటా 3.5 బిలియన్ల దాలర్లుగా ఉన్నాయి. కానీ కరోనా వైరస్‌ గుప్పిట్లో చైనా ఉక్కిరిబిక్కిరవుతున్నది. ఇప్పుడు వీటిని ఇతర దేశాలకు సరఫరా చేయలేని దుస్థితిలో చైనా ఉన్నది.

also read క్రిప్టోక‌రెన్సీల‌పై సుప్రీం కోర్ట్ సంచ‌ల‌న తీర్పు...

కర్మాగారాలన్నీ మూతబడటంతో అక్కడ ఉత్పత్తి నిలిచి పోయింది. ఈ క్రమంలో దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు.. కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. అందుకే ఔషధ ఎగుమతులపై ఆంక్షలను తెచ్చారు. 

సోమవారం భారతదేశంలో మూడు కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్ దేశాల ప్రభుత్వాల నుంచి వచ్చే వారికి వీసాలను రద్దు చేస్తోంది.

మనం ఎగుమతి చేసే ఔషధాలు చాలా తక్కువే. గతేడాదిలో 225 మిలియన్ డాలర్ల విలువైన ఏపీఐలను మాత్రమే భారత్ ఎగుమతి చేసింది. చైనా నుంచి దిగుమతులు తగ్గడంతో మన ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. 
 

click me!