కరోనా ఎఫెక్ట్ అంతులేనిది: అలర్ట్ కాకుంటే అంతే.. చైనా పరిశోధకురాలు హెచ్చరిక

By Sandra Ashok Kumar  |  First Published May 27, 2020, 10:41 AM IST

ఇప్పటి వరకూ మానవాళిపై వైరస్‌ల ప్రభావం గోరంత మాత్రమేనని చైనాలోని వుహాన్‌ వైరాలజీ సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ షీ ఝెంగ్లీ స్పష్టం చేశారు. మున్ముందు వైరస్‌లు మానవాళిపై దాడి చేయనున్నాయని, వాటి నుంచి బయటపడక పోతే ముప్పు తప్పదని హెచ్చరించారు.
 


బీజింగ్‌: మున్ముందు మానవాళిపై వైరస్‌లు పెద్ద ఎత్తున దాడి చేయనున్నాయని చైనాలోని వుహాన్‌ వైరాలజీ సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌, ‘చైనా బ్యాట్‌ ఉమన్‌'గా ప్రఖ్యాతిగాంచిన షీ ఝెంగ్లీ హెచ్చరించారు. ఇంతవరకూ బయటపడని వైరస్‌లు కలుగజేసే రోగాలబారి నుంచి మనుషులను రక్షించాలంటే వాటి గురించి లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. 

ఇప్పటివరకూ కనుగొన్న వైరస్‌లు అత్యంత అల్పమని, కనుగొనాల్సిన వైరస్‌లు ఇంకా చాలా ఉన్నాయని, వాటితో పెద్ద ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరించారు. చైనాలోని ఓ  టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంగళవారం ఆమె మాట్లాడారు. కరోనా వైరస్ కేవలం గోరంత మాత్రమేనని, ముందు ఉన్నది మొసళ్ల పండుగ అని హెచ్చరించారు. అప్రమత్తం కాకపోతే ముప్పును ఎదుర్కోక తప్పదని స్పష్టం చేశారు. 

Latest Videos

undefined

అంటువ్యాధులపై పోరుకు అంతర్జాతీయ సమాజం మధ్య సహకారం అవసరమన్నారు. వైరస్‌లపై పరిశోధన జరిపేందుకు శాస్త్రవేత్తలు, ప్రభుత్వాల మధ్య పారదర్శకత, సహకారం అవసరమని, సైన్స్‌ను రాజకీయం చేయడం చాలా విచారకరమని తెలిపారు. 

ప్రపంచ మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్‌కు, చైనాలోని వుహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు లింక్ పెడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పదేపదే ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సైన్స్‌ను రాజకీయం చేయడం విచారకరం అని షీ ఝెంగ్లీ పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకున్నది. 

‘మున్ముందు మానవులు అంటువ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే, ప్రకృతిలోని జంతువుల్లో ఇప్పటివరకూ బయటపడని వైరస్‌ల గురించి ముందస్తుగా తప్పనిసరి అధ్యయనం చేయాలి. వాటి గురించి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి’ అని ఝెంగ్లీ అన్నారు. 

వాటిపై సరైన అధ్యయనం జరుపకుంటే మానవాళిపై మరో మహమ్మారి దాడి చేసేందుకు అవకాశం ఉన్నదని ఝెంగ్లీ హెచ్చరించారు. తాను పరిశోధనలు సాగిస్తున్న వైరస్‌లలోని జన్యు లక్షణాలు, కరోనా వైరస్‌ లక్షణాలతో సరిపోడంలేదని స్పష్టం చేశారు. కరోనా తమ ల్యాబ్‌లోనే పుట్టిందన్న వార్తలను తోసిపుచ్చారు. 

also read వారసుడొచ్చాడు...రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి ఎంట్రీ..

గబ్బిలాల్లో కరోనా వైరస్‌ ప్రభావంపై పరిశోధన చేస్తున్నందుకు షీ ఝెంగ్లీకి ‘చైనా బ్యాట్‌ ఉమన్‌' అనే పేరు వచ్చింది. 2003లో సార్స్‌ వ్యాధి విజృంభించింది. వ్యాధి సోకిన వాళ్లలో దాదాపు పది శాతం మంది మరణించారు. ‘సార్స్‌'కు వ్యాక్సిన్‌ను కనిపెట్టే క్రమంలో అంతర్జాతీయ నిపుణుల బృందంతో ఝెంగ్లీ కలిసి పనిచేశారు. 

ఈక్రమంలో చైనాలోని యునాన్‌, నానింగ్‌ తదితర నగరాల శివారుల్లో ఉన్న గుహల్లోని గబ్బిలాలపై ఆమె పరిశోధనలు జరిపారు. ‘సార్స్‌' వ్యాధికి కారణమైన వైరస్‌ గబ్బిలాల నుంచే సంక్రమించిందని నిర్ధారించారు. ఈ ఫలితాలు సార్స్‌ వ్యాక్సిన్‌ తయారీకి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ క్రమంలో కరోనా మహమ్మారి మూలాల్ని తెలుసుకోవడానికి ఆమె చేస్తున్న పరిశోధనల్ని నిపుణులు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు.

గతేడాది డిసెంబర్ 30 రాత్రి ఏడు గంటలకు షీ ఝెంగ్లీకి వుహాన్ వైరాలజీ సంస్థ డైరెక్టర్ నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో ఆమె అప్రమత్తం అయ్యారు. సదరు వైరాలజీ సంస్థకు అనుమానాస్పద స్థితిలో  రోగుల వైద్య పరీక్షల నమూనాలు రావడం వల్లే షీ ఝెంగ్లీకి సంస్థ డైరెక్టర్ కాల్ చేశారు. 

ఇద్దరు రోగులకు వైవిధ్య భరితమైన న్యూమోనియా వ్యాధి వచ్చినట్లు వుహాన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిగ్గు తేల్చడంతో షీ ఝెంగ్లీ తన పరిశోధనలను పునరుద్ధరించాలని నిర్ణయించారు. 

తన అంచనాలు నిజమైతే ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు పొంచి ఉందని షీ ఝెంగ్లీ అంచనా వేశారు. ఇదే ఇద్దరు పేషంట్లకు చెందిన కుటుంబ సభ్యులు తీవ్రమైన శ్వాసకోశ సంబంధ లక్షణాల వ్యాధి ‘సార్స్’తో ఇంతకుముందు మరణించడమే ఆమె అలర్ట్ కావడానికి మరో కారణం. 

సార్స్ 2002-03 మధ్య 800 మందిని, తర్వాత 8,100 మందిని బలి తీసుకున్నది. నాటి నుంచి సార్స్ గురించి ఆమె పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. సార్స్‌కు, సార్స్- కొవిడ్-19కు సంబంధం ఉందా? అన్న కోణంలో షీ ఝెంగ్లీ పరిశోధన సాగుతోంది. కరోనా వల్ల చైనాలో మరణించిన వారిలో అత్యధికులు, బాధితుల్లో 80 శాతం మంది హుబే రాష్ట్రం వుహాన్ ప్రాంత వాసులే కావడం గమనార్హం. 
 

click me!