33 చైనా సంస్థలు ఆ దేశానికి తమ రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నాయని అమెరికా మండిపడింది. వాటి ఎగుమతులపై ఆంక్షల కొరడా ఝుళిపించింది.
బీజింగ్: కరోనా విశ్వమారి పుణ్యమా? అని అమెరికా-చైనా మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం రాజుకుంటోంది. మరో 33 చైనా కంపెనీలు, చైనా ప్రభుత్వ రంగ సంస్థలపై ట్రంప్ సర్కార్ ఎగుమతి ఆంక్షలు విధించింది. ఇందులో యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్, వెబ్ బ్రౌజర్లు సరఫరా చేసే ‘కిహూ360’, ఇంటర్నెట్ ఆధారిత రోబోలు తయారు చేసే ‘క్లౌడ్‌మైండ్స్ టెక్నాలజీ’ అనే కంపెనీలూ ఉన్నాయి.
అమెరికా చర్యపై చైనా అధికారికంగా దీనిపై ఇంకా స్పందించలేదు. అయితే ఈ కంపెనీలు మాత్రం అమెరికాపై నిప్పులు గక్కాయి. దేశ భద్రత పేరుతో ట్రంప్ సర్కార్ వాణిజ్యాన్ని రాజకీయం చేస్తోందని విమర్శించాయి. అమెరికా ఇప్పటికే చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ‘హువే’పై దేశ భద్రత పేరుతో వాణిజ్య ఆంక్షలు విధించడంపై చైనా మండిపడింది.
చైనా కంపెనీల మేధో చౌర్యం లేదా ఆ దేశ ప్రభుత్వంతో ఈ కంపెనీలకు ఉన్న సంబంధాలతో అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడిందని ట్రంప్ సర్కార్ చెబుతోంది. ముఖ్యంగా ఈ కంపెనీలు కీలక సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి అందజేసే ప్రమాదం ఉందని, అందుకే ఈ కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నట్టు ట్రంప్ సర్కార్ పేర్కొంది. చైనా మాత్రం తమ కంపెనీల నుంచి ఎదురయ్యే వాణిజ్య పోటీని ఊహించుకుని భయపడే అమెరికా ఇదంతా చేస్తోందని విమర్శించింది.
also read నో డౌట్..శాశ్వతంగా మూతే: టూరిజం కంపెనీలపై తేల్చేసిన బీఓటీటీ
మరోవైపు భారత్ కూడా చైనా కంపెనీల విషయంలో జాగ్రత్త పడుతోంది. ఇప్పటికే సరిహద్దు దేశాల పేరుతో చైనా కంపెనీలేవీ భారత కంపెనీలను టేకోవర్ చేయకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను కట్టడి చేసేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చింది.
ఇప్పుడు చైనాకు చెందిన వీడియో కాన్ఫరెన్స్ యాప్ ‘జూమ్’ వినియోగాన్ని కట్టడి చేసేందుకు సిద్ధమైంది. ఈ యాప్‌కు ప్రత్యామ్నాయంగా దేశీయంగా సరై న యాప్‌ను అభివృద్ధి చేయాలని 10 దేశీయ ఐటీ కంపెనీలను కోరింది. ఇందులో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌తో పాటు చెన్నై కేంద్రంగా పనిచేసే జోహో కార్ప్, హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే పీపుల్‌లింక్ కంపెనీ ఈ జాబితాలో ఉన్నాయి.
జూమ్ యాప్ ద్వారా కీలక సమాచారం చైనాకు పోతోందన్న వార్తలతో కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. వీడియో కాన్ఫరెన్స్‌ల కోసం జూమ్’ వినియోగించవద్దని కేంద్రం ఇప్పటికే సైనిక దళాలు, ప్రభుత్వ శాఖలను ఆదేశించింది.