Bajaj కంపెనీ నుంచి మరో కొత్త బైక్ రాబోతోంది. ఇది మామూలు పెట్రోల్ బైక్ కాదు. సరికొత్త CNG బైక్. ఇప్పటికే ప్రపంచంలో మొట్టమొదటి CNG బైక్‌ను విడుదల చేసి బజాజ్ కంపెనీ రికార్డ్ సృష్టించింది. ఇదే స్పీడ్‌తో మరో సీఎన్‌జీ బైక్‌ను మార్కెట్‌లోకి తెచ్చేందుకు రెడీ అవుతోంది. మరి నూతన సీఎన్‌జీ బైక్ అప్‌డేట్స్ తెలుసుకుందాం.. రండి.
Bajaj కంపెనీ అధినేత రాజీవ్ బజాజ్ త్వరలోనే కొత్త CNG బైక్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త బైక్ Freedom 125 కంటే తక్కువ ధరకే లభిస్తుందట. అంతేకాకుండా 100cc ఇంజిన్‌తో వస్తుందని తెలిసింది. ఇది కనుక మార్కెట్‌లోకి వస్తే మనకు పెట్రోల్ కష్టాలు తీరినట్టే అని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన Bajaj కంపెనీ Freedom 125కి ప్రజలు విపరీతంగా ఆకర్షితులయ్యారు. ఇది కేవలం రూ.1,10,000లకే వస్తుండటంతో వినియోగదారులు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పెట్రోల్ కష్టాలకు చెక్..
భారీగా పెరిగిన పెట్రోల్ కష్టాల నుంచి ప్రజలను బయట పడేసేందుకు బజాజ్ కంపెనీ ముందుకొచ్చింది. సీఎన్‌జీ బైక్‌ల తయారీలో ప్రపంచంలోని ఇతర కంపెనీల కంటే ముందు దూసుకుపోతోంది. ఇప్పటికే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ తయారు చేసి రికార్డ్ సృష్టించింది.
ఎలక్ట్రిక్ బైక్‌లతో పోటీ..
ప్రపంచ వ్యాప్తంగా రానున్న పెట్రోల్ కొరతను అధిగమించేందుకు ఇప్పటికే ఎలక్ట్రిక్ బైక్‌లు మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఓలా రోడ్‌స్టర్, అల్ట్రా వైలెట్ ఎఫ్77 మ్యాచ్2, రివోల్ట్ ఆర్వీ 400, ఫెర్రాటో డిస్రప్టర్, మొదలైన ఎలక్ట్రిక్ బైక్‌లను ప్రజలు వినియోగిస్తున్నారు. అయితే ఛార్జింగ్ సమస్యల కారణంగా ఎక్కువ ప్రజాదారణ పొందడం లేదు. దీంతో మళ్లీ పెట్రో బైకుల వైపే ప్రజలు చూడాల్సిన పరిస్థితి. ఈ ఇబ్బందులను అధిగమిస్తూ ప్రజలు సీఎస్‌జీ బైక్‌లు వినియోగించేలా చేసేందుకు బజాబ్ ముందడుగు వేసింది.
Freedom 125కు డిమాండ్..
ఇటీవలే Freedom 125 పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్‌ను Bajaj కంపెనీ విడుదల చేసింది. ఈ కొత్త CNG బైక్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వచ్చే నెల నుంచి డెలివరీలు ప్రారంభం చేయనున్నట్లు బజాజ్ కంపెనీ తెలిపింది. సుమారు 20,000 బైక్‌లు అమ్ముడుపోతాయని కంపెనీ అంచనా వేసింది. 2025 జనవరి నాటికి ఈ సంఖ్య 40,000 దాటుతుందని భావిస్తున్నారు. ఈ బైక్‌కు లభిస్తున్న అనూహ్య స్పందన నేపథ్యంలోనే Bajaj కంపెనీ తన తదుపరి CNG బైక్‌ను సిద్ధం చేస్తోంది.
రూ.95,000లకే Bajaj Freedom 125 బైక్..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన Bajaj కంపెనీ అధినేత రాజీవ్ బజాజ్ త్వరలోనే కొత్త CNG బైక్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త బైక్ Freedom 125 కంటే తక్కువ ధరకే లభిస్తుందని తెలిపారు. 100cc ఇంజిన్ కెపాసిటీ కలిగి ఉంటుందన్నారు.
పొడవైన సీటు, LED హెడ్‌ల్యాంప్‌లు, డిజిటల్ స్పీడోమీటర్లు, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి. Bajaj Freedom 125 బైక్ ప్రారంభ ధర రూ.95,000 (ఎక్స్-షోరూమ్). గరిష్ట ధర రూ.1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని ఆయన ప్రకటించారు.
తక్కువ ధర.. ఎక్కువ మైలేజీ..
రోజువారీ ఇంధన ఖర్చును తగ్గించేందుకు Bajaj Freedom 125 బైక్‌ను రూపొందించినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సాధారణ పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే 50 శాతం వరకు ఖర్చు తగ్గుతుందన్నారు. 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్, 2 కిలోల CNG ట్యాంక్‌లు ఫ్రీడం 125లో ఉన్నాయి. ఈ బైక్‌లో దాదాపు 330 కి.మీ. ప్రయాణించవచ్చు.
తగ్గనున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు..
ఇకపై Bajaj కంపెనీ తన Chetak ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కూడా తక్కువ ధర వేరియంట్‌ను పరిచయం చేయనుందట. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో Bajaj కంపెనీ కొత్త ఆలోచనలు చేస్తోందని సమాచారం.