వోక్స్‌వ్యాగన్ పోలో 12వ వార్షికోత్సవం సందర్భంగా 'లెజెండ్ ఎడిషన్' కారును విడుదల చేసింది. మార్కెట్లో ఈ మోడల్ కార్లలో ఇక ఇదే చివరిది కానుంది.
వోక్స్‌వ్యాగన్ పోలో భారతదేశంలో తన పన్నెండేళ్ల ప్రస్థానాన్ని ఈ ఏడాది చివరలో ముగించనుంది. జర్మనీకి చెందిన ఈ కార్‌మేకర్ ఇండియన్ మార్కెట్లో పాపులర్ మోడెల్ గా నిలిచిన వోక్స్‌వ్యాగన్ పోలో మోడల్ కారుకు ప్రతి సంవత్సరం చిన్నచిన్న అప్‌డేట్‌లను అందించినప్పటికీ, 2010లో దేశంలో లాంచ్ అయినపుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. ఈ స్పోర్టీ హాచ్ బ్యాక్ కారులో గణనీయమైన అప్‌గ్రేడ్‌లను ఏమీ కంపెనీ తీసుకురాలేదు. దీంతో మార్కెట్లో ఇతర కంపెనీలకు చెందిన దీని రేంజ్ కార్లతో పోటీపడలేక సేల్స్ దారుణంగా పడిపోతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో వోక్స్‌వ్యాగన్ పోలో ఉత్పత్తిని నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది.
ఈ ఐకానిక్ హాచ్‌బ్యాక్ కారుకు తగిన వీడ్కోలు ఇవ్వడానికి, ఫోక్స్‌వ్యాగన్ పోలో 12వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఫేర్ వెల్ ఎడిషన్ కారును కంపెనీ లాంచ్ చేసింది. ఈ ఫేర్ వెల్ ఎడిషన్‌కు 'లెజెండ్ ఎడిషన్' అని పేరు ఇచ్చారు. ఇది పరిమిత సంఖ్యలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
undefined
ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ.. "వోక్స్‌వ్యాగన్ పోలో అనేది వినియోగదారులలో వివిధ భావోద్వేగాలను రేకెత్తించిన ఒక ఐకానిక్ కార్. స్పోర్టీ డిజైన్, దృఢమైన నిర్మాణం, మెరుగైన భద్రత ఫీచర్లు, ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవం లాంటి అంశాలు ఈ కారుని ఎంతో మంది భారతీయ వినియోగదారులను ఇష్టపడేలా చేశాయి. ఇలాంటి ఐకానిక్ కారును చివరి ఎడిషన్ సొంతం చేసుకునే వారికి తాము గర్వంతో ఆహ్వానం పలుకుతున్నాం" అని పేర్కొన్నారు.
Volkswagen Polo Legend Editionస్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్పెషల్ లెజెండ్ ఎడిషన్ మోడల్ ఇంజిన్ స్పెసిఫికేషన్‌లు పోలో స్టాండర్డ్ శ్రేణికి సమానంగా ఉంటాయి. అయితే 1.0-లీటర్ MPi అలాగే 1.0-లీటర్ TSi టర్బోచార్జ్డ్ అనే రెండు పెట్రోల్ ఇంజన్ ఛాయిస్ లలో ఇది లభిస్తుంది. ఇందులో 1.0-లీటర్ MPi ఇంజన్ 75 bhp వద్ద 95 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. రెండోది 109 bhp వద్ద 175 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బేస్ వెర్షన్ మోడెల్ కారులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అలాగే టర్బోచార్జ్డ్ యూనిట్లో 6-స్పీడ్ మాన్యువల్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ప్రభుత్వ BS6 ఉద్గార షరతుల నేపథ్యంలో ఇందులో డీజిల్ వెర్షన్ లేదు.
ఫీచర్‌ల పరంగా.. Apple CarPlay, Android Auto, క్రూయిజ్ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్‌తో కూడిన 6.5-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, వెనుక కూర్చునే వారి కోసం AC వెంట్‌లు, పార్కింగ్ సెన్సార్‌లు, EBDతో కూడిన ABS , హిల్-హోల్డ్ అలాగే హిల్-స్టార్ట్ అసిస్ట్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు తదితర ఫీచర్లు ఉన్నాయి. ట్రెండ్‌లైన్, కంఫర్ట్‌లైన్, హైలైన్ ప్లస్, GT అనే నాలుగు వేరియంట్లలో లభించే వోక్స్‌వ్యాగన్ పోలో కార్ లెజెండ్ ఎడిషన్ ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 6.45 లక్షల నుండి రూ. 10.25 లక్షల వరకు ఉన్నాయి.