Electric Three Wheeler: తెలంగాణలో మరో భారీ పరిశ్రమ.. ఎక్కడంటే..?

By team telugu  |  First Published Apr 20, 2022, 12:48 PM IST

తెలంగాణలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాల రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద కర్మాగారం తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్టు ‘బిలిటీ’ ఎలక్ట్రిక్‌ సంస్థ ప్రకటించింది.
 


తెలంగాణలో రూ.1,144 కోట్లతో భారీ త్రిచక్ర వాహనాల తయారీ పరిశ్రమను ఏర్పాటు కానుంది. ఈ మేరకు బిలిటీ సంస్థ ప్రకటించింది. మెుత్తం 200 ఎకరాల్లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. ఏటా 2.4 లక్షల విద్యుత్‌ వాహనాల తయారీ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా వెల్మల పారిశ్రామికవాడలో దీన్ని ఏర్పాటు చేస్తారు. అయితే త్రిచక్ర వాహనాల పరిశ్రమ ఏర్పాటులో భాగంగా.. మెుదటి విడతలో 13.5 ఎకరాల్లో 18 వేల వాహనాల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో పరిశ్రమను ఏర్పాటు చేస్తారు. ఈ విషయాన్ని బిలిటీ సంస్థ సీఈవో రాజా గాయం తెలిపారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమతో 3 వేల మందికి ఉపాధి దొరకుతుంది. సంస్థకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కేటీఆర్ సైతం భరోసా ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ వాహనాల విధానం ఎంతో బాగుందని.. బిలిటీ సంస్థ చెబుతోంది. పరిశ్రమలకు కావాల్సిన మౌలిక వసతులు ఉన్నాయని తెలిపింది. రాష్ట్రాన్ని విద్యుత్‌ వాహనాల ప్రపంచస్థాయి కేంద్రంగా మార్చడంలో తాము భాగస్వామ్యం అయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. 2023లో నిర్మాణాన్ని పూర్తి చేసి, 2024లో ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఇక్కడ కార్గో మోడల్‌ టాస్క్‌మ్యాన్‌, ప్యాసింజర్‌ వెర్షన్‌ అర్బన్‌ పేర్లపై త్రిచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తారు.

Latest Videos

విద్యుత్‌ వాహనాల రంగంలో అతిపెద్ద పెట్టుబడి అని మంత్రి కేటీఆర్ చెప్పారు. పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మరింత వేగంగా ముందుకెళ్లేందుకు సహకరిస్తుందన్నారు. అమెరికాకు చెందిన ఈవీ సంస్థ ఫిస్కర్‌ కూడా హైదరాబాద్‌లో రెండో ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుందని గుర్తు చేసుకున్నారు. బిలిటీ సంస్థకు ప్రపంచంలోని 15 దేశాల్లో వాహనాల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. బిలిటీ తయారు చేసిన త్రిచక్ర వాహనం టాస్క్‌మాన్‌ ఆటోను అమెజాన్‌, ఐకియా, బిగ్‌ బాస్కెట్‌, జొమాటో, ఫ్లిప్‌ కార్ట్‌ లాంటి దిగ్గజ సంస్థలు ఉపయోగిస్తున్నాయి.

click me!