
లోకకళ్యాణం కోసం ఆధ్యాత్మికవాదులు వివిధ దేవతా కార్యక్రమములు జరిపిస్తున్న దేశం మనది. లోకా సమస్తా సుఖినోభవంతు అనేది మనం నినాదం. భూమిపుత్రుడు కుజుడు ఉచ్చ స్థితిలో శని భగవానునితో కలిసి మకరరాశిలో ప్రస్తుతం ఉన్నాడు. అదేవిధంగా శని కుజుడి నక్షత్రమైన ధనిష్ట మీద ప్రవేశించారు. అనగా వారు ఇరువురి లక్షణాలను పరస్పరం కొద్దిగా కలిగి ఉంటూ కలిసి కొంతకాలం ప్రయాణం చేస్తారు. కాలపురుషుడు చక్రంలో పదవ రాశి మకరరాశి. కర్మ సంబంధితం . అతి త్వరలో అనగా 24 గంటల నుండి 30 గం లోపు వారితో బుధ శుక్రులతో పాటు మనో కారకుడైన చంద్రుడు కూడా చేరతాడు. చంద్రుడు రెండున్నర రోజులు ఒక రాశిలో ఉంటాడు అని అందరికీ తెలుసు. అనగా ఒక మూడు రోజులు మొత్తం మీద పంచ గ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. గ్రహ కూటములు ఏర్పడడం సర్వసాధారణం. అయితే కొన్ని ప్రత్యేక గ్రహముల కలయిక అనేది చాలా సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతూ ఉంటుంది.
సుమారు రెండున్నర సంవత్సరాలుగా అదే రాశి లో ఉంటున్న శని గత ఏడు సంవత్సరాలుగా ఈ మకరరాశి మీద ప్రభావం చూపిస్తూనే ఉన్నాడు. ఇంకో రెండున్నర సంవత్సరాల పాటు చూపిస్తాడు. అటువంటి శని ఉన్న రాశిలో అత్యంత ప్రభావం కలిగిన సైన్య అధ్యక్షుడు భూమి పుత్రుడు కుజుడు చంద్రునితో , శుక్రుడు, బుధుడు తో కలిసి చూపించే ప్రభావం కొద్దిగా ఇబ్బందులను కలగజేస్తుంది.
* గోచార ప్రభావము ఎక్కువగా దేశ కాల పరిస్థితుల మీద ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఇటువంటి అరుదైన గ్రహముల కలయికలు ఏర్పడే ముందు 40 రోజుల నుండి అనగా సంక్రాంతి పండుగ నుండి ఏర్పడిన ఐదు నెలల వరకు అనగా ఆషాడ మాసం వరకు తన యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి అని పెద్దలు అంటారు.
* ప్రస్తుతం మత కలహాలను రేకెత్తించే విధంగా కొన్ని శక్తులు పనిచేయడం గమనిస్తున్నాం. అదేవిధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోవడం వలన అంతర్గత కలహాలు కూడా ఏర్పడుతున్నాయి.
* బుధ గ్రహం యొక్క అత్యుత్సాహం కారణంగా వాచాలత వలన వచ్చే ఇబ్బందులు ప్రత్యక్షంగా చూస్తున్నాం.
* ప్రస్తుతం ఈ కూటమి ప్రభావం వలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. న్యాయవ్యవస్థ ఆదేశాలను లెక్క చేయరు.
* దేశవ్యాప్తంగా అల్లకల్లోలం, ఉగ్రవాదుల ఉన్మాద చర్యలు జరిగే అవకాశం ఉంటుంది. నూటికి 95 శాతం ఉగ్రవాద చర్యలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోగలదు . తప్పిన ముప్పు ను పట్టించుకోని జనం, ప్రతిపక్షాలు పాలకపక్షమును ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించిననూ ధర్మం ప్రభుత్వంవైపు ఉంటుంది గనుక విజయం సాధిస్తారు.
* అణుధార్మిక మూలకముల వలన విపరీతమైన నష్టములు ఏర్పడే అవకాశం ఉంటుంది. మైనింగ్ రంగం వినాశనానికి దారి తీసే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో ఆందోళనలు వచ్చే అవకాశం ఉంది. జల ప్రళయం... సూచనలు. అయితే కర్మ సంబంధిత రాశిలో వీరి కలయిక కొన్ని శుభ పరిణామాలను కూడా సూచిస్తుంది. అంతరిక్ష రంగంలో పరిశోధనలు ఫలిస్తాయి. కుంభరాశిలో గురుడు ప్రభుత్వాన్ని ప్రజలను తప్పకుండా కాపాడుతాడు.
లోకకళ్యాణం కోసం జరిపించే శివపార్వతుల కళ్యాణం, శివరాత్రి అభిషేకములు, వసంత నవరాత్రులలో జరిపించే అమ్మవారి పూజలు, శ్రీ రామ నవమి కళ్యాణం, సస్యశ్యామల దేశం కోసం జరిపించే శ్రీ వారాహి నవరాత్రులు మొదలైనవి శత్రునాశనం చేస్తూ సకల విషయాలను ప్రజలకు అందించి ఆయురారోగ్యాలను సామాన్య ప్రజలకు సర్వ దేవతలు ప్రసాదించే అవకాశం తప్పకుండా ఉన్నది. పై ఆరాధనలలో మనకు అందుబాటులో ఉన్నది ఏదైనా సరే కనీసం ఆలయ దర్శనం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది.
శుక్రుడి అనుగ్రహం కోసం స్త్రీలను గౌరవించండి. కుమారి పూజ వీలైనప్పుడు చేయండి . బుధుని యొక్క అనుగ్రహంతో చక్కటి మాట తీరుకు విష్ణువును ఆరాధించండి. మొక్కలు పెంచండి. శని కుజుల ఉగ్రత తగ్గడం కోసం హనుమాన్ చాలీసా పఠనం మేలుచేస్తుంది. చంద్రుని చల్లని చూపు కోసం శివపార్వతులను నమస్కరించి దీవెనలు తీసుకోండి.
జలతర్పణం చేయడం, మంచినీటి కేంద్రం ఏర్పాటు చేయడం చక్కటి నివారణ ఉపయోగం. దయచేసి ఈ ఆరు నెలల కాలంలో బయట తయారు చేసిన పానీయాలు తాగకండి. ఇంట్లో తయారుచేసిన నిమ్మకాయ నీరు, కమ్మటి మజ్జిగ తేట మొదలగునవి ఇతరులకు అందించండి.
గర్భవతులు ఆందోళన చెందకండి. చక్కని సుఖమైన ప్రసవానికి అమ్మవారిని ధ్యానించండి.
డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151