కార్తీక మాసంలో ఈ రోజు కోటి సోమవారం...నేడు ఇలా చేస్తే అనంత ఫలం మీ సొంతం....

By Nagaraju penumalaFirst Published Nov 4, 2019, 8:39 AM IST
Highlights

శ్రవణ నక్షత్రం ఉంటే ఆరోజును కోటి సోమవారంగా వ్యవహరిస్తారు.  ఇటువంటి సోమవారాలు చాలా అరుదుగా వస్తాయి. 2019, నవంబర్‌ 4న సోమవారం శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్న సోమవారం కావడంతో కోటి సోమవారంగా పిలుస్తారు.  

హైదరాబాద్: భక్తులకు పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీకం మాసం. కృత్తికా చంద్రుల సహవాసం కార్తీకమాసంగా పురాణాలు చెప్తున్నాయి. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో స్నాన, దాన, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు చేయడం వల్ల జన్మజన్మపాపాలు హరించిపోతాయని ప్రతీతి. 

అందుకే స్కంద పురాణం ఈ కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉందని తెలియజేస్తోంది. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు, వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదని స్కంద పురాణం చెప్తోంది. 

పరమశివుడికి అంత్యంత ఇష్టమైన మాసం కార్తీక మాసం. అభిషేక ప్రియుడు అయిన ఆ శివయ్యుకు భక్తులు వివిధ రకాలుగా అభిషేకాలు చేసి స్వామివారి అనుగ్రహం పొందుతారు. దీపావళి అనంతరం వచ్చే కార్తీక మాసంలో దీపారాధనకి కూడా ఎంతో విశిష్టత ఉంది. 

ఇకపోతే నేడు కార్తీక మాసం మెుదటి సోమవారం. అయితే ఈ కార్తీక మెుదటి సోమవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రవణ నక్షత్రం ఉంటే ఆరోజును కోటి సోమవారంగా వ్యవహరిస్తారు.  ఇటువంటి సోమవారాలు చాలా అరుదుగా వస్తాయి. 

2019, నవంబర్‌ 4న సోమవారం శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్న సోమవారం కావడంతో కోటి సోమవారంగా పిలుస్తారు. కోటి సోమవారం రోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాల ఉపవాసం ఉన్న పుణ్య ఫలం దక్కుతుంది. 

నవంబర్‌ 4 సోమవారం రోజున శివాలయ సందర్శనం, అభిషేకం, ఉపవాసం లేదా నక్తం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి అనుసారం వారు చేస్తే మంచిది. అదేవిధంగా ఈ రోజు దీపారాధన, ఆకాశదీప దర్శనం, దానాలు, ధర్మాలు చేస్తే ఆ ఫలితం రెట్టింపు అవుతుందని శాస్త్ర ప్రవచనం.

కోటి సోమవారం అయిన నేడు ఉదయం శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోష కాలమందు భక్తుల ఇంట్లో దీపారాధన చేసి పూజ ముగించుకుని శివాలయానికి వెళ్లి మరోసారి ఈశ్వరుడిని దర్శించుకోవాలి. ఆలయంలో దీపారాధన చేయాలి. 

అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేస్తే కోటి సోమవారాలు ఉపవాసమున్న పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కోటి సోమవారం నాడు ఉపవాసం ఉండి నియమ నిష్టలతో కోటి సోమవారం దీక్ష పూర్తి చేస్తే స్వామివారి అనుగ్రహం పొందుతారని ప్రతీతి. 

ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు ఓం నమఃశివాయ పంచాక్షరితో భక్తి ప్రపత్తులతో శివుడికి దగ్గరగా ఉపవాసం చేయాలి. మెుత్తానికి కోటి సోమవారం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగిపోతున్నాయి. ఓం నమ:శ్శివాయ అంటూ భక్తులు ఆ శ్రీహరిని కొలుస్తున్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

ఈ కార్తీకమాసంలో... శివునికి ఏ అభిషేకం చేస్తే ఏం ఫలితం వస్తుంది

నియమ నిష్ఠల మాసం.. కార్తీక మాస విశిష్టత

click me!