నిత్య దశాధిపతులు- ఫలితాలు

By ramya neerukondaFirst Published Oct 2, 2018, 2:04 PM IST
Highlights

రవి నిత్యదశాధిపతి అయితే శిరోవ్యాధిని, మనోవ్యాధిని, శత్రుసముదాయమందు సంచారమును, అధికారుల యందు కలహాన్ని, అకాలభోజనాన్ని, శూరత్వాన్ని, కోపాన్ని, మనస్సులో విచారాన్ని, మరణవార్తా శ్రవణాన్ని, శరీరాయాసమును, కార్యవిఘ్నాలు మొదలైనవి కలుగుతాయి.

జన్మ నక్షత్రము మొదలుకొని నిత్యనక్షత్రము వరకు లెక్కించి వచ్చిన సంఖ్యను 7చే గుణించి 9 చే భాగించగా శేషం రవ్యాదిక్రమంగా 1 అయితే రవి; 2-చంద్రుడు; 3-కుజుడు; 4 బుధుడు; 5-గురుడు; 6- శుక్రుడు; 7 - శని; 8-రాహువు; 9 - కేతువు. ఈ క్రమంలో నిత్యదశాధిపతులౌతారు.

రవి నిత్యదశాధిపతి అయితే శిరోవ్యాధిని, మనోవ్యాధిని, శత్రుసముదాయమందు సంచారమును, అధికారుల యందు కలహాన్ని, అకాలభోజనాన్ని, శూరత్వాన్ని, కోపాన్ని, మనస్సులో విచారాన్ని, మరణవార్తా శ్రవణాన్ని, శరీరాయాసమును, కార్యవిఘ్నాలు మొదలైనవి కలుగుతాయి.

చంద్రుడు నిత్యదశాధిపతి అయితే రాజుయొక్క దర్శనం వలన లాభాన్ని, పుష్ప వస్త్రములయొక్క దర్శనం, దేవబ్రాహ్మణులయందు భక్తి, స్త్రీ ధరించే వస్త్రం దొరుకుట, దూరవార్తయొక్క శ్రవణం, శీతల పదార్థప్రాప్తి, మనస్సులో విష్ణుభక్తిని, మిత్రదర్శనలాభాన్ని, సుఖభోజన ప్రాప్తిని కలుగచేస్తాడు.

కుజుడు నిత్యదశాధిపతియగుచుండగా ధన విషయంపై కఠినమైన ఆలోచన అనగా ధనలుబ్ధత, కఠిన మనస్సు, విచారం, అధిక కోపం, దూరవార్తలు వినుట, రాజభయం, శత్రుభయం, ప్రయాణం, విశేష కలహం, బ్రహ్మద్వేషం యొక్క సంప్రాప్తం మొదలైనవి కలుగుతాయి.

బుధుడు నిత్యదశాధిపతి అయితే బంధుదర్శన లాభం, విద్యాప్రాప్తి, ధనాగమం, రాజవృత్తాంత శ్రవణం, శుభవార్తలు వినుట, పరగృహనివాసం, బ్రహ్మజ్ఞానం, కుశాగ్రబుద్ధి, మంత్రసిద్ధి, మితభోజనం, జ్యోతిశ్శాస్త్రంలో వ్యాసంగం మొదలైనవి సంభవిస్తాయి.

గురువు నిత్యదశాధిపతి అయితే వేదవిద్యాగోష్ఠి, దేవబ్రాహ్మణులయందు భక్తి కల్గుట, మనస్సుకు ఉత్సాహ కార్యం, స్నానం వస్త్రం మొదలైన అలంకారాలు, సౌఖ్యభోజన లాభాలు కలుగుతాయి.

శుక్రుడు నిత్యదశాధిపతి అయితే తాంబూలాది సౌఖ్యమును, సువర్ణలాభం, వస్త్రలాభం, కందమూల ఫలాదుల యొక్క సంప్రాప్తం రాజసన్నిధియందు స్వాతంత్య్రం, సుఖం, స్త్రీ సంగమమందు ప్రీతి, సౌఖ్యభోజన ప్రాప్తి, స్నేహితులయొక్క దర్శనం వలన లాభం కలుగుతాయి.

శని నిత్యదశాధిపతి అయితే లభించిన కార్యాల యొక్క వినాశం, మనోవికలం, అధికనిద్ర, మందబుద్ధి,  యత్నించిన కార్యాలు చెడిపోవుట, శూద్రులతో కలహం, మనో విచారం, అధికాయాసం మొదలైనవి కల్గుతాయి.

రాహువు నిత్యదశాధిపతి అయితే మ్లేచ్ఛజనుల వల్ల భయం, ఋణమిచ్చినవారి వలన బాధ, శత్రుబాధ, భోజనమందు రుచిలేకపోవడం, దుర్మార్గబుద్ధి, దుష్టాచారం, సర్పదర్శనం మొదలైనవి సంభవిస్తాయి.

కేతువు నిత్య దశాధిపతి అయితే నౌకరులయందు కోపం కల్గుట, ప్రతి వ్యక్తితో కలహం, మనస్సుకు భయం, దుష్టసంభాషణం, ప్రయాణం, రాజభయమునిస్తాడు.

జాతకమైనా, గోచారమైనా సంఘటనాత్మకం కాదు. మానసికమైన అంశాలపై గోచార గ్రహాల ప్రభావం అధికంగా ఉంటుంది. మనస్తత్వంలోని మార్పులను గమనించే విధానమే జ్యోతిష సంప్రదాయం. మనస్సు అన్నింకీ కీలకం కావడం వల్ల మనోభావాలలో వచ్చే మార్పులే ప్రధానంగా గమనించాలి. తమ మనోభావాలలోని లోపాలను తాము వ్యక్తీకరించలేని పరిస్థితే ఒత్తిడి. ఈ ఒత్తిడే వేరు వేరు అనారోగ్యాలు ఏర్పడడానికి కారణం. వ్యక్తులలో వెంట వెంటనే మారిపోయే మనస్తత్వాలకు, వ్యక్తీకరించే కోపం, ప్రేమ మొదలైన అంశాలకు కూడా నిత్య గోచార ప్రభావం అధికం. జరుగుతున్న హోరల ప్రభావం కూడా ఈ అంశాన్ని తెలియజేస్తుంది. మనసులోని మార్పులను నిరంతరం అధ్యయనం చేస్తుంటే వీరికి సంబంధించిన ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. మనస్సుపై నియంత్రణ ఉండే ఆధ్యాత్మికవేత్తకు ఇటువిం గోచారాదుల వల్ల సమస్యలుండవు. అందరూ ఆ మార్గంలో కృషి చేయడం ద్వారా సంతృప్తికరమైన జీవనం ఏర్పడుతుంది.

click me!