‘మేషరాశి’ వాళ్ల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

By ramya neerukondaFirst Published Aug 20, 2018, 1:38 PM IST
Highlights

తమకు ఏదైనా బాధ్యతను అప్పజెపితే మాత్రం ఆ బాధ్యతను పరిపూర్ణంగా నిర్వహిస్తారు. వీరు ఎక్కువగా చురుకుగా ఉంటారు. శారీరక శ్రమ ఎంతో ఎక్కువగా ఉంటే తప్ప
తొందరగా అలసట అనేది ఉండదు.

వీరు మధ్యమదేహంతో బక్క పలచగా ఉంటారు. తమ ఆత్మీయులు ఏదైనా ఒక పనిని తలపెట్టితే అదే పనిలో వీరు నిమగ్నమై ఉంటారు. వేరే ఆలోచనలు చేయరు. వీరు సైనికులుగా పని చేస్తారు. తమకు ఏదైనా బాధ్యతను అప్పజెపితే మాత్రం ఆ బాధ్యతను పరిపూర్ణంగా నిర్వహిస్తారు. వీరు ఎక్కువగా చురుకుగా ఉంటారు. శారీరక శ్రమ ఎంతో ఎక్కువగా ఉంటే తప్ప తొందరగా అలసట అనేది ఉండదు. కొండనైనా ఢీకొనే తత్త్వం కలవారు. మొండి ధైర్యంతో పనిచేస్తారు. 

చేసే పనిలో ప్రణాళిక, నైపుణ్యం కనపడతాయి. ఆ పనిలో సంతోషాన్ని, ఆనందాన్ని వెతుక్కుంటారు. వీరు తమపై మరొకరి ఆధిపత్యాన్ని అంగీకరించరు. పది మందితో పని చేయించే లక్షణం వీరికి ఉంటుంది. ఈ తత్త్త్వం నచ్చని వారికి శత్రువులుగా కనపడతారు. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని వీరు ఇష్టపడతారు. ఎవరైనా క్రమశిక్షణను అతిక్రమిస్తే దండించడానికి కూడా వెనకాడరు.

మేషరాశి ప్రథమభావం అయి ఆ భావం బలహీనంగా ఉంటే పైన చెప్పిన లక్షణాలన్నీ పోయి కొంత పిరికి వారిగా తాము ఏ పనీ చేయలేనివారిగా ఉంటారు. ఉదా : నాకు ధైర్యం లేదు - ఏ పనిని చేయలేక పోతున్నాను - శరీరం అందంగా లేదు - శరీరం దృఢంగా లేదు - ఆత్మవిశ్వాసం లేదు - భయంగా ఉంటుంది - మొదలైన శారీరక మానసిక బలహీనతలతో కూడుకున్న ప్రశ్నలు ప్రథమభావ లోపాలకు సంబంధించినవి.

లగ్నాధిపతి పైన చూపిన స్థానాల్లో ఉంటే శరీరం రోగగ్రస్థమవుతుందని పై సూత్రాల ఆధారంగా తెలుస్తుంది. లగ్నాధిపతి 6,8,12 స్థానాల్లో ఉన్నా, లగ్నంలో 8, 12 స్థానాధిపతులు ఉన్నా, అశుభగ్రహాలు లగ్నంలో ఉన్నా, లగ్నాధిపతితో కలిసి ఉన్నా,అష్టకవర్గులో లగ్నంలో 24 కన్నా తక్కువ బిందువులున్నా ప్రథమభావ లోపాలకు సంబంధించిన ఇబ్బందులు వ్యక్తిలోని ఆలోచనలను ప్రేరేపిస్తాయి.

శారీరక బలహీనతలు ఏర్పడడానికి మూలం పూర్వకర్మలలో మరొకరి దేహాన్ని నిందించడమో, అనవసరంగా చాలా మందిని భయపెట్టడమో, శరీర శక్తిని అతిగా చూపించి అధికారం చెలాయించడమో జరిగి ఉండాలి. వీనికి ప్రాయశ్చిత్తంగా జ్యోతిర్వైద్యాన్ని నిర్వహించి ఆలోచనా విధానాలను మార్చాల్సి ఉంటుంది.

జ్యోతిర్వైద్య ప్రక్రియలో తమ శరీరం పరిపూర్ణమైనదని భావిస్తూ శరీరం ద్వారా ఇతరులకు సహకరించడం, ఇతరులు అందంగా మారడానికి కావలసిన శారీరక, మానసిక, ఆర్థిక సహకారాలను అందించడం, మానసికమైన అందమే ముఖ్యమైనదని భావించడం, శరీర దృఢత్వం లేని ఇతరులకు సహకరించే ప్రయత్నం చేయడం వంటివి చేయాల్సి ఉంటుంది.

తాము అనుకున్న అన్ని పనులు నెరవేర్చ గలమని, దేనినైనా సాధించగల శక్తి సామర్థ్యం ఉన్న వారమని, తమ వెనుక భగవంతుని అద్భుత శక్తి ఉన్నదని, తాము చాలా అందంగా ఉన్నామని, శరీర శక్తితో, మానసిక యుక్తితో వ్యవహరిస్తామనే భావనలతో వ్యతిరేక ఆలోచన నుండి అనుకూల ఆలోచనగా మార్చుకోవాలి.అత్యున్నతమైన కార్యాలు చేయడానికి మాత్రమే ఈ శరీరాన్ని వినియోగించాలి. ఉపయోగంలేని పనులకు వినియోగించకూడదు.

డా.ప్రతిభ

click me!