పార్లమెంట్ లో వైసీపీ మహిళాశక్తి: ఆ నలుగురు.....

By Nagaraju penumalaFirst Published May 25, 2019, 7:52 PM IST
Highlights

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళా ఎంపీలు సందడి చేయనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నలుగురు మహిళలు ఎంపీలుగా పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్నారు. వారిలో ఒకరు సీనియర్ కాగా మిగిలిన ముగ్గురు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారే కావడం విశేషం.

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళా ఎంపీలు సందడి చేయనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నలుగురు మహిళలు ఎంపీలుగా పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్నారు. వారిలో ఒకరు సీనియర్ కాగా మిగిలిన ముగ్గురు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారే కావడం విశేషం.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పార్లమెంట్ కు పోటీ చేసిన వంగాగీత ఘన విజయం సాధించారు. అభ్యర్థుల ప్రకటనకు ముందురోజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆమె అనూహ్యంగా కాకినాడ పార్లమెంట్ టికెట్ దక్కించుకున్నారు.

కాకినాడ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పై గెలుపొందారు. సునీల్ పై 25,738 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతంలో తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఇటీవలే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె అనూహ్యంగా టికెట్ దక్కించుకోవడం గెలుపొందండ చకచకా జరిగిపోయాయి. 

ఇదిలా ఉంటే పార్లమెంట్ కు సైతం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు మహిళ నేతలు ఎన్నికయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం నుంచి తొలిసారిగా పార్లమెంట్ కు పోటీ చేశారు చింతా అనురాధ. 

తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమెకు వైయస్ జగన్ అమలాపురం లోక్ సభ టికెట్ కేటాయించారు. చింతా అనురాధ తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ పై 37,904 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. 

 

గంటి హరీష్ మాజీ లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు కావడం విశేషం. జీఎంసీ బాలయోగి తనయుడును ఢీ కొట్టడంతోపాటు అమలాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఎన్నికైన రెండో మహిళగా రికార్డు సృష్టించారు చింతా అనురాధ.  

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి లోక్ సభకు పోటీ చేసిన డా.వెంకట సత్యవతి సైతం ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ పై 87,829 ఓట్లతో గెలుపొందారు. ఈమె తొలిసారిగా పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్నారు. 

అరకు లోక్ సభ నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి గొడ్డేటి మాధవి సైతం ఘన విజయం సాధించింది. రాజకీయ కురువృద్ధుడు, టీడీపీ అభ్యర్థి  కిషోర్ చంద్రదేవ్ పై భారీ విజయం సాధించింది. మాజీకేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ పై కనీవినీ ఎరుగని రీతిలో 2, 19,836 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. 

అంతేకాదు అతి చిన్న వయసులో పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్న మహిళగా కూడా రికార్డుసృష్టించారు మాధవి. రాజకీయ ఉద్దండుడు, రాజవంశీయుడైన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ ను ఓడించడమే కాకుండా 26 ఏళ్లకే  పార్లమెంట్ మెట్లెక్కబోతున్న తొలిమహిళగా కూడా ఆమె అరుదైన ఘనత దక్కించుకుంది. 

మెుత్తానికి ఏపీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేతలు చట్టసభలలో హల్ చల్ చేయబోతున్నారు. నలుగురు ఎంపీలు పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్నారు. సో వైసీపీలో మహిళారాజ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందన్నమాట. 
 

ఈ వార్తలు  కూడా చదవండి

ఎపి అసెంబ్లీలో మహిళా శక్తి ఇదే: ఒక్కరు టీడీపి, 13 మంది వైసిపి

click me!