టీడీపి ప్రచారంలో వంగవీటి రాధాకు చేదు అనుభవం

By Nagaraju penumalaFirst Published Apr 4, 2019, 2:04 PM IST
Highlights

రాధాకృష్ణ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉండే కేశవరంలో రాధా కాన్వాయి గ్రామంలోకి వస్తుందని తెలుసుకున్న వారంతా పంచాయితీ కార్యాలయం దగ్గర బైఠాయించారు. తండ్రిని చంపిన పార్టీలో చేరి,  ఆ పార్టీకి మద్దతుగా ఎలా ప్రచారం చేస్తున్నావంటూ మండిపడ్డారు. 

మండపేట : మాజీ ఎమ్మెల్యే, టీడీపీ స్టార్ కాంపైనర్ వంగవీటి రాధాకృష్ణకు తూర్పుగోదావరి జిల్లాలో పరాభవం ఎదురైంది. మండపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనను కాపు సామాజిక వర్గం నేతలు అడ్డుకున్నారు. 

బుధవారం రాత్రి మండపేట టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు మద్దతుగా ఆయన కేశవరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు వంగవీటి రాధాపై నిరసన వ్యక్తం చేశారు. 

రాధాకృష్ణ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉండే కేశవరంలో రాధా కాన్వాయి గ్రామంలోకి వస్తుందని తెలుసుకున్న వారంతా పంచాయితీ కార్యాలయం దగ్గర బైఠాయించారు. 

తండ్రిని చంపిన పార్టీలో చేరి,  ఆ పార్టీకి మద్దతుగా ఎలా ప్రచారం చేస్తున్నావంటూ మండిపడ్డారు. గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

మండపేట రూరల్‌ సీఐ లక్ష్మణరెడ్డి ఆందోళనకారులతో చర్చించారు. ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవడం సరికాదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు శాంతించకపోవడంతో రాధా అక్కడ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

కేశవరం నుంచి రాధాను రాజమహేంద్రవరం పంపించి వేశారు టీడీపీ నేతలు. అయితే ఆందోళనకారులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాధా. మీరు నా మీద ఎంత ద్వేషం పెంచుకున్నా ఫర్వాలేదన్నారు. మీరు ద్వేషం పెంచుకున్నా అంతే ప్రేమ, ఆప్యాయత, అనురాగం రంగా మీద చూపించాలని కోరారు. 

అది తనకు చాలని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోనే వంగవీటి రాధాకు ఘోర పరాభవం ఎదురుకావడం టీడీపీ శిబిరంలో గుబులు రేపుతోంది.  

click me!