ఏపీ ఎన్నికల్లో విషాదం: పోలింగ్ కేంద్రాల్లోనే ప్రాణాలొదిలిన 9 మంది

By Siva KodatiFirst Published Apr 12, 2019, 1:27 PM IST
Highlights

వృద్ధులు, మహిళలు ఎండను సైతం లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది వృద్ధులు పోలింగ్ కేంద్రాల్లోనే మరణించడంతో విషాదం చోటు చేసుకుంది. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోటెత్తారు. వృద్ధులు, మహిళలు ఎండను సైతం లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది వృద్ధులు పోలింగ్ కేంద్రాల్లోనే మరణించడంతో విషాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా వేమూరు మండలం కుచ్చెళ్లపాడుకు చెందిన షేక్ జాన్ బీ(100) కుటుంబసభ్యుల సాయంతో పోలింగ్ బూత్‌లోకి వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందారు.

అమరావతి మండలం కర్లపూడికి చెందిన దేవరకొండ ప్రసాద్ అనే వృద్ధుడు పోలింగ్ సిబ్బందికి గుర్తింపుకార్డు చూపిస్తూనే మరణించారు. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం కేఈ చిన్నయ్యపాలెంకు చెందిన శీరం మాణిక్యం పోలింగ్ క్యూలో ఎండ తీవ్రతకు సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు.

కృష్ణాజిల్లా ఆత్కూరు గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ ఎక్కువ సేపు క్యూలో ఉండటంతో విపరీతంగా చెమటలు పట్టి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తొలుసూరుపల్లికి చెందిన బగాది సరస్వతి కుటుంబసభ్యుల సాయంతో వీల్‌చైర్‌లో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అనంతరం తిరిగి ఇంటికి వెళ్తూ మార్గమధ్యంలోనే ఆమె మరణించారు. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం మోగులూరుకు చెందిన బోజేడ్ల లీలావతి ఎండ వేడిమి తాళలేకపోయారు. ఓటు వేసి బయటకు వచ్చిన కొద్ది క్షణాల్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

వెంటనే తోటి ఓటర్లు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగానే లీలావతి మరణించారు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం ముత్తుకూరుకు చెందిన మొగిలమ్మ ఓటు వేసి తిరిగి ఇంటికి వెళ్తూ వడదెబ్బకు గురై మృతి చెందారు.

అనంతపురం జిల్లా రొద్దం మండలంలో మండ్లి గంగమ్మ ఓటు వేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఎండ వేడిమ తాళలేక ఇంటికి తిరిగి వచ్చి ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన బండారు ముసలయ్య పోలింగ్ బూత్‌లో ఓటు వేసి అనంతరం బయటకు తిరిగి వస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

అయితే వృద్ధులు, మహిళల కోసం ఎన్నికల సంఘం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే తమ వారు మరణించారని మృతుల బంధువులు ఆరోపించారు. 

click me!