బీహార్‌లో ఉన్నామా, ఆంధ్రాలో ఉన్నామా: ఏపీలో పోలింగ్‌పై జీవీఎల్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Apr 12, 2019, 1:15 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా గురువారం జరిగిన హింసాత్మక ఘటనలు బీహార్‌ను తలపించాయన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా గురువారం జరిగిన హింసాత్మక ఘటనలు బీహార్‌ను తలపించాయన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. విజయవాడలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల సంఘం ఎక్కువ మందిని నియమించినట్లయితే ఎన్నికలు సజావుగా సాగి ఉండేవని ఆశాభావం వ్యక్తం చేశారు.

ధన రాజకీయాలు రాష్ట్రంలో శృతిమించాయని, ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడుతుందని జీవీఎల్ జోస్యం చెప్పారు. సీఎం చంద్రబాబు కూడా తన స్థాయిని మరిచి దుర్మార్గంగా రాజకీయాలు చేశారని.. తప్పుడు విమర్శలతో ఆయన ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారని నరసింహారావు విమర్శించారు.

ఎన్నికల్లో డబ్బు, రౌడీయిజంతో ప్రజలను భయపెట్టారని, ధన రాజకీయాలతో అధికారంలోకి వచ్చేందుకు ఆరాటపడ్డారని ఆరోపించారు. ధన ప్రవాహంపై చంద్రబాబు, జగన్ స్పందించాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.

ఎన్నికలకు మరింత సమయం ఉండి వుంటే బీజేపీకి మంచి ఫలితాలు వచ్చేవని, ఏపీలో బీజేపీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఏపీలో టీడీపీ కనుమరుగు కావడం ఖాయమని, ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తుందని జీవీఎల్ స్పష్టం చేశారు. 

click me!