టీడీపీలో చేరి తప్పు చేశా, శిక్ష అనుభవించి పుట్టింటికి వచ్చా: వైసీపీలోకి ఎంపీ బుట్టా రేణుక

By Nagaraju penumalaFirst Published Mar 16, 2019, 6:43 PM IST
Highlights

తాను తెలుగుదేశం పార్టీలో చేరి చాలా పెద్ద తప్పు చేశానని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు ఎంతో గౌరవం ఉండేదన్నారు. ఒక బీసీ మహిళా నేతగా, ఆడపడుచుగా తనకు ఎంతో గౌరవం ఉండేదని అయితే చిన్న మిస్టేక్ తో చాలా పెద్ద తప్పు చేశానని భావించి ఆ తప్పు తెలుసుకుని మళ్లీ వైసీపీలో చేరానని చెప్పుకొచ్చారు. 
 

హైదరాబాద్: కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరి తప్పు చేశానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

తాను తెలుగుదేశం పార్టీలో చేరి చాలా పెద్ద తప్పు చేశానని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు ఎంతో గౌరవం ఉండేదన్నారు. ఒక బీసీ మహిళా నేతగా, ఆడపడుచుగా తనకు ఎంతో గౌరవం ఉండేదని అయితే చిన్న మిస్టేక్ తో చాలా పెద్ద తప్పు చేశానని భావించి ఆ తప్పు తెలుసుకుని మళ్లీ వైసీపీలో చేరానని చెప్పుకొచ్చారు. 

తెలుగుదేశం పార్టీలో పారదర్శకత అనేది ఉండదన్నారు. పేరుకు ఎన్నో చెప్తారని అవన్నీ ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప వేరేది ఏమీ ఉండదన్నారు. తెలుగుదేశం పార్టీ తనను మోసం చేసిందన్నారు. 

తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అంటూ చెప్పుకునే చంద్రబాబు నాయుడు బీసీ మహిళను తీసేసి అగ్రకులస్థులకు సీటివ్వడమా అంటూ నిలదీశారు. బీసీ సీట్లను కూడా అగ్రకులస్థులకే కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆలూరు నియోజకవర్గం, మంగళగిరి నియోజకవర్గంలో బీసీ నేతలకు జరిగిన అవమానం అందుకు నిదర్శనమన్నారు. 

చేనేత కార్మికులకు అండగా ఉంటామని చెప్పుకునే చంద్రబాబు చేనేత సామాజిక వర్గానికి చెందిన తనకు చేసిన అన్యాయంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేరుకు మాటలు మాత్రమే చెప్తారని కానీ మాటలు ఆచరణలో ఉండదన్నారు. 

పొరుగింటి కూర పుల్లన అన్న చందంగా తాను టీడీపీని చూసి అలా ఫీలయ్యానని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరిన నెల రోజుల నుంచి తనను మానసికంగా వేధించారని ఆమె ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను ఎలాంటి షరతులు పెట్టకుండా వచ్చానని తెలిపారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు చేస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరి పెద్ద తప్పు చేశానని అక్కడ మానసిక క్షోభకు గురయ్యానని అదంతా వదిలేసి వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు. 

ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉంటే గౌరవం ఉంటుంది అని బుట్టా రేణుక అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను పార్టీలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉందని పుట్టింటికి వచ్చినట్లు ఉందని బుట్టా రేణుక అభిప్రాయపడ్డారు. తాను వచ్చే ఎన్నికల్లోపోటీ చెయ్యాలా లేదా అనేది పార్టీ నిర్ణయమని తాను మాత్రం ఏమీ ఆశించి రాలేదన్నారు. 

click me!