చిన్నాన్నతో జగన్‌కు వైరం.. వివేకా హంతకులను విడిచిపెట్టం: బాబు

By Siva KodatiFirst Published Mar 18, 2019, 10:16 AM IST
Highlights

ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు జగన్‌‌కు లేదన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా అమరావతిలో ఆయన సోమవారం పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు

ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు జగన్‌‌కు లేదన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా అమరావతిలో ఆయన సోమవారం పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు .

ఆ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..ఎన్నికల యుద్ధంలో వైసీపీ సరెండర్ అయ్యే పరిస్ధితి వస్తోందన్నారు. జగన్ గతంలో తన చిన్నాన్నను రెండుసార్లు కొట్టడంతో పాటు రాజీనామా చేయించారని చంద్రబాబు ఆరోపించారు.

పోలవరంపై తెలంగాణ మరోసారి సుప్రీంకోర్టులో కేసు వేసిందని, టీఆర్ఎస్‌తో జగన్ అంటకాగుతున్నారని సీఎం ఎద్దేవా చేశారు. కోటి మంది అక్కాచెల్లెళ్ల అండ మనకు ఉందని, ఎక్కడికెళ్లినా టీడీపీకి అపూర్వ ఆదరణ లభిస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు.

రైతులు, మహిళలు, యువత తోడ్పాటుతో ఎన్నిక ఏకపక్షం కావాలని ఆకాంక్షించారు. లబ్ధిదారులంతా తెలుగుదేశం పార్టీకే మద్ధతు తెలుపుతున్నారని వెల్లడించారు. నామినేషన్ల రోజే టీడీపీ గెలుపు ఖరారు కావాలని చంద్రబాబు తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఊహించని ఆధిక్యత వస్తుందని వైసీపీకి ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుందని, దౌర్జన్యాలు పెరిగిపోతాయన్నారు. ఆంధ్రా వ్యతిరేకులతో అంటకాగే పార్టీకి ప్రజలే బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

వైఎస్ వివేకాతో జగన్‌కు రాజకీయ వైరం ఉందని, ఎంపీగా రాజీనామా చేయాలని వివేకాను జగన్‌ గతంలో బెదిరించారన్నారు. చిన్నాన్న హత్యనే గుండెనొప్పిగా పక్కదారి పట్టించారని సిట్ విచారణలో అసలు నిజాలన్నీ బయటకు వస్తాయని చంద్రబాబు వెల్లడించారు. వివేకా హత్యలో దోషులను వదిలేది లేదని ఇది అభివృద్ధికి, అరాచకానికి మధ్య జరిగే ఎన్నికగా ఆయన అభివర్ణించారు. 

click me!