అందుకే: కోడెల మీద దాడిపై తేల్చేసిన వైసిపి నిజనిర్ధారణ కమిటీ

By telugu teamFirst Published Apr 17, 2019, 11:36 AM IST
Highlights

ఇనిమెట్లలో 160వ పోలింగ్‌ బూత్‌లో స్పీకర్‌ గంటన్నరకు పైగా లోపలే ఉన్నారని, ఓటర్లను రెచ్చగొట్టి భయభ్రాంతులకు గురిచేయటం వల్ల తమ ఓట్లను దొంగిలిస్తున్నారనే ఆందోళనతో తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని వైసిపి నిజనిర్ధారణ కమిటీ సభ్యులు అన్నారు. 

గుంటూరు: గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనిమెట్లలోని పోలింగ్‌ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు రౌడీయిజం చేసి, ఏజెంట్లను బయటకు పంపించి గన్‌మెన్లతో తలుపులు వేయించారని, అంద వల్లనే అక్కడ ఓటర్లు తిరుగుబాటు చేశారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నిజనిర్ధారణ కమిటీ తేల్చింది. కమిటీ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, పార్టీ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్‌, నేతలు బ్రహ్మానంద రెడ్డి, నిమ్మకాయల రాజనారాయణ, అంబటి రాంబాబు ఆ విషయాన్ని తేల్చెశారు. 

మంగళవారం సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఏర్పడేందుకు వారం పాటు కమిటీ పర్యటనను వాయిదా వేస్తున్నామని చెప్పారు. ఇనిమెట్లలో 160వ పోలింగ్‌ బూత్‌లో స్పీకర్‌ గంటన్నరకు పైగా లోపలే ఉన్నారని, ఓటర్లను రెచ్చగొట్టి భయభ్రాంతులకు గురిచేయటం వల్ల తమ ఓట్లను దొంగిలిస్తున్నారనే ఆందోళనతో తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని వైసిపి నిజనిర్ధారణ కమిటీ సభ్యులు అన్నారు. 

జిల్లా ఎస్పీ కోడెల గన్‌మెన్లను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని వారు అభిప్రాయపడ్డారు. ఇనిమెట్ల సంఘటనపై రాజుపాలెం ఎస్‌ఐకు ఇనిమెట్ల పోలింగ్‌ ఏజెంట్లు ఫిర్యాదు చేసినా వెంటనే కేసు నమోదు చేయలేదని వారు తప్పు పట్టారు. ఎస్‌ఐ చట్టబద్ధంగా వ్యవహరించలేదని, దానిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. పోలీసులు కోడెల అడుగులకు మడుగులొత్తుతున్నారని విమర్శించారు. 

తమ పార్టీ కార్యకర్తలపై పెట్టిన 307 కేసును ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఇనిమెట్ల ఘటనను పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకుని వెళ్లినట్లు వారు తెలిపారు. వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇనిమెట్ల ప్రజానీకానికి వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
 
పోలీసులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇనిమెట్ల ఘటనలో డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు, టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసు నమోదు చేశారని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో 17వ తేదీన చేయాలనుకున్న నిరాహారదీక్షను విరమిస్తున్నట్లు తెలిపారు.  

click me!