వైఎస్ కోట పులివెందుల: టీడీపీ 'ఢీ' కొట్టేనా

By narsimha lodeFirst Published Mar 11, 2019, 3:26 PM IST
Highlights

డప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఉంది.ఈ స్థానం నుండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పలు దఫాలు ప్రాతినిథ్యం వహించారు. ఇదే స్థానం నుండి  మరోసారి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ మరోసారి బరిలోకి దిగనున్నారు.

కడప: కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఉంది.ఈ స్థానం నుండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పలు దఫాలు ప్రాతినిథ్యం వహించారు. ఇదే స్థానం నుండి  మరోసారి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ మరోసారి బరిలోకి దిగనున్నారు.

కడప జిల్లాలోని పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి  ఒక్క సారైనా విజయం సాధించాలని టీడీపీ ప్రయత్నం చేస్తోంది. కానీ, ఇప్పటివరకు ఆ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

1955 నుండి ఇప్పటివరకు ఈ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఎక్కువగా  వైఎస్ఆర్ కుటుంబసభ్యులే విజయం సాధించారు.1955లో తొలిసారిగా ఈ స్థానానికి జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన పెంచికల భాస్కర్ రెడ్డి విజయం సాధించారు. 1962లో చవ్వా బాలిరెడ్డి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి నెగ్గారు.1967, 1972లలో పెంచికల్ బసిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

1978లో తొలిసారిగా ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టారు.1978, 1983, 1985 ఎన్నికల్లో కూడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

1989లో కడప పార్లమెంట్ స్థానం నుండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోటీ చేశారు. దీంతో పులివెందుల నుండి  వైఎస్ఆర్  సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు.

1991లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్‌పీ రెడ్డి ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా నెగ్గారు. 1994లో కూడ ఈ స్థానం నుండి వైఎస్ వివేకానంద రెడ్డి విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో మరోసారి పులివెందుల నుండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

2004లో కూడ ఇదే స్థానం నుండి వైఎస్ విజయం సాధించారు. 2004లో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు.2009 ఎన్నికల్లో కూడ ఇదే స్థానం నుండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. 2009 సెప్టెంబర్ రెండో తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి  మృతి చెందారు.

దీంతో ఈ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.కాంగ్రెస్ పార్టీతో విబేధించి వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. దీంతో కడప ఎంపీ స్థానానికి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు.

ఈ ఉప ఎన్నికల్లో పులివెందుల నుండి వైఎస్ విజయమ్మ, కడప నుండి జగన్ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో పులివెందుల నుండి జగన్ తొలిసారిగా వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగి విజయం సాధించారు. మరోసారి ఇదే స్థానం నుండి ఆయన పోటీకి రెడీ అయ్యారు.

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులపై  టీడీపీ అభ్యర్ధిగా సతీష్ కుమార్ రెడ్డి పలు దఫాలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఈ దఫా పులివెందుల నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా సతీష్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ నియోజకవర్గానికి సాగు, తాగు నీటిని సాధించడంలో టీడీపీ కృషి చేసిందని సతీష్ రెడ్డి గుర్తు చేస్తున్నారు.


 
 

click me!