చంద్రబాబు టార్గెట్ కొడాలి నాని: గుడివాడ టీడీపీ అభ్యర్థి ఆయనే

By telugu teamFirst Published Mar 9, 2019, 7:56 AM IST
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు నుంచి పోటీ చేసే కొడాలి నానిపై ఎవరిని పోటీకి దించాలనే విషయంపై మల్లగుల్లాలు పడిన చంద్రబాబు చివరకు అవినాష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. గుడివాడ నిజానికి తెలుగుదేశం పార్టీ కంచుకోట.

విజయవాడ: గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిపై ఉత్కంఠకు పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెర దించారు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు, దివంగత టీడీపీ నేత దేవినేని నెహ్రు తనయుడు దేవినేని అవినాష్‌కు గుడివాడ టీడీపీ టికెట్‌ ఖరారు చేశారు.

వైఎస్సార్ కాంగ్రెసు నుంచి పోటీ చేసే కొడాలి నానిపై ఎవరిని పోటీకి దించాలనే విషయంపై మల్లగుల్లాలు పడిన చంద్రబాబు చివరకు అవినాష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. గుడివాడ నిజానికి తెలుగుదేశం పార్టీ కంచుకోట. టీడీపీ ఆవిర్భావం తర్వాత 9 సార్లు ఎన్నికలు జరిగితే కేవలం రెండుసార్లు మాత్రమే టీడీపి ఓడిపోయింది. 

గత ఎన్నికల్లో గుడివాడను వైసిపి గెలుచుకుంది.ఈసారి ఎలాగైనా గుడివాడలో గెలిచి తీరాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. గుడివాడ నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) దూకుడుకు కళ్లెం వేయాలని అనుకుంటున్నారు. 

అందులో భాగంగా గతంలో నానిపై పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు స్థానంలో యువకుడైన అవినాష్‌ని రంగంలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయించారు.. అవినాష్‌ 18వ ఏట విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తండ్రి స్థాపించిన యూఎస్‌వో కార్య క్రమాలతోపాటు సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 2012లో లండన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అనంతరం ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. 

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తొలి యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు యువత తొలి అధ్యక్షుడిగా కూడా అవినాష్‌ బాధ్యతలు చేపట్టారు.

click me!