ఓటమి భయం పట్టుకొంది, నాకు జగన్ సమ ఉజ్జీ కాడు: చంద్రబాబు

By narsimha lodeFirst Published Mar 31, 2019, 3:37 PM IST
Highlights

దేశానికి మోడీ ఏం చేశారో, రాష్ట్రానికి తానేం చేశానో చర్చకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు. గుజరాత్ రాష్ట్రానికి మోడీ ఏం చేశారో, సమైక్య రాష్ట్రానికి తాను ఏం చేశాననో చర్చించేందుకు కూడ రెడీగా ఉన్నానని ఆయన ప్రకటించారు.

తుని:దేశానికి మోడీ ఏం చేశారో, రాష్ట్రానికి తానేం చేశానో చర్చకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు. గుజరాత్ రాష్ట్రానికి మోడీ ఏం చేశారో, సమైక్య రాష్ట్రానికి తాను ఏం చేశాననో చర్చించేందుకు కూడ రెడీగా ఉన్నానని ఆయన ప్రకటించారు.

ఆదివారం నాడు తునిలో నిర్వహించిన ఎన్నికల సభలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.వైసీపీకి ఓటమి భయం పట్టుకొందని చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. పోరాటానికి సమ ఉజ్జీ ఉండాలన్నారు. అనంతపురంలో కియా పరిశ్రమను ఏపీకి రాకుండా అడ్డుకోవాలని నరేంద్ర మోడీ అడ్డుపడినట్టు చెప్పారు.

గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలతో పోటీపడి  ఏపీకి కియా ఫ్యాక్టరీని తీసుకొచ్చినట్టు ఆయన గుర్తు చేశారు. కియా ఫ్యాక్టరీని నేనే తీసుకొచ్చినట్టుగా మోడీయే చెప్పుకోలేదు... కానీ వైసీపీ మాత్రం మోడీ వల్లే కియా ఫ్యాక్టరీ వచ్చిందని చెప్పడం దారుణమని బాబు చెప్పారు.

ఏపీకి ఇచ్చిన హామీలను మోడీ నెరవేర్చలేదని బాబు వివరించారు. ప్రత్యేక హోదాతో పాటు ఇతర ఏ హామీలను నెరవేర్చలేదని బాబు ఆరోపించారు.ఈవీఏంలను కూడ తారుమారు చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జగన్‌పై 31 కేసులున్నాయని ఆయన చెప్పారు. బాబ్లీ ప్రాజెక్టుపై ఉద్యమం చేసిన సమయంలో తనపై కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. 

అసెంబ్లీకి 24 సార్లు వస్తే కోర్టుకు 243 దఫాలు వెళ్లారని జగన్‌పై ఆయన మండిపడ్డారు.  వైసీపీతో పోరాటం చేయడం తనకు సిగ్గు అనిపిస్తోందన్నారు.  ఫెడరల్ ఫ్రంట్‌లో చేరితే తప్పేంటని జగన్ ప్రశ్నించడాన్ని ఆయన తప్పుబట్టారు.

ప్రత్యేక హోదా ఇస్తామని కేసీఆర్ నీ చెవిలో చెప్పాడా అని జగన్‌ను ప్రశ్నించారు. హైద్రాబాద్‌ కంటే అమరావతిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కేసీఆర్‌ చెప్పినట్టుగా జగన్ నడుచుకొంటున్నారని బాబు  విమర్శలు గుప్పించారు.పేదలకు ఇళ్ళ బకాయిలను రద్దు చేస్తున్నట్టుగా బాబు ప్రకటించారు.  


 

click me!