బాలయ్య ప్రచార బాధ్యతలను తీసుకొన్న భార్య వసుంధరా దేవి

By narsimha lodeFirst Published Apr 8, 2019, 11:13 AM IST
Highlights

అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తరపున ప్రచార బాధ్యతలను ఆయన సతీమణి వసుంధరా దేవి తీసుకొన్నారు.

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తరపున ప్రచార బాధ్యతలను ఆయన సతీమణి వసుంధరా దేవి తీసుకొన్నారు.

హిందూపురం అసెంబ్లీ స్థానం టీడీపీకి కంచుకోట  టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు ఈ స్థానం నుండి  మూడు దఫాలు విజయం సాధించారు. 1985 నుండి మూడు దఫాలు ఈ స్థానం నుండి ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా గెలిచారు.

 ఎన్టీఆర్ తర్వాత ఆయన తనయుడు హరికృష్ణ ఇదే స్థానం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి  సినీ నటుడు బాలకృష్ణ తొలిసారిగా టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి నవీన్ నిశ్చల్‌పై బాలకృష్ణ 16,196 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ నుండి ఆ తర్వాత వైసీపీ నుండి నవీన్ నిశ్చల్ మూడు దఫాలు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

 ఈ దఫా హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి నవీన్ నిశ్చల్ స్థానంలో మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్‌ను వైసీపీ బరిలోకి దింపింది.ఈ నియోజకవర్గంలో సుమారు 35 వేలకు పైగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. మైనార్టీలను ఆకట్టుకొనేందుకు వైసీపీ ఇక్బాల్‌ను రంగంలోకి దింపినట్టుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

హిందూపురం ప్రజలు ఎదుర్కొంటున్న తాగు నీటి సమస్యను బాలకృష్ణ పరిష్కరించారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుండి కృష్ణా నీటిని హిందూపురం ప్రజలకు అందించడంలో బాలకృష్ణ విజయం సాధించారు.

ప్రత్యేక పైపులైన్ ద్వారా తాగు నీటిని అందించడంతో పాటు అదే రూట్‌లోని ప్రాంతాలకు సాగునీటిని కూడ అందిస్తున్నారు.బాలకృష్ణ సతీమణి వసుంధరా దేవి హిందూపురంలోనే చాలా రోజులుగా ఉంటున్నారు. బాలయ్య తరపున ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో వైపు ఉగాది పర్వదినం వేడుకలను ఆమె హిందూపురంలోనే నిర్వహించుకొన్నారు.

click me!