
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో సత్యమేవ జయతే బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. దేశ, రాష్ట్ర యువత కలల నగరం విశాఖపట్నం అంటూ చెప్పుకొచ్చారు.
తాను విశాఖపట్నం వచ్చినప్పుడు ఒక శుభవార్త తీసుకువచ్చినట్లు తెలిపారు. దశాబ్ధాల నాటి కలగా మిగిలిపోయిన రైల్వే జోన్ ను ప్రకటించినట్లు తెలిపారు. విశాఖ రైల్వే జోన్ అంశంపై గత కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే తాము దాన్ని ఒక లక్ష్యంగా అమలు చేశామని తెలిపారు.
విశాఖపట్నంకు ఆదాయం చేకూరాలనే లక్ష్యంతో రైల్వే జోన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్థిక, ఉపాధి వ్యవస్థలు రైల్వే జోన్ వల్ల లాభపడతాయన్నారు. అభివృద్ధి దేశ రాష్ట్ర యువత కలలు నెరవేరుస్తామన్నారు. యువత ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమన్నారు.
విశాఖపట్నంకు 6 జాతీయ రహదారులు నిర్మించిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కు అంతర్జాతీయ హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ విస్తరణ, రోడ్ల విస్తరణ, పలు కేంద్ర సంస్థలను తీసుకువచ్చినట్లు మోదీ తెలిపారు.