
ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కేంద్రం ఉద్దేశాలను ప్రశ్నించే ముందు ముఖ్యమంత్రి ఉద్దేశాలేంటో బయటకు చెప్పాలి అని ప్రశ్నించారు.
విశాఖకు రైల్వేజోన్ కేటాయించాలంటూ వారం రోజుల క్రితం చంద్రబాబు తనకు లేఖ రాసిన విషయాన్ని బహిర్గతం చేశారు. తీరా రైల్వే జోన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడెందుకు ఇలా విమర్శలు చేస్తున్నారని నిలదీశారు. ఇవ్వనంత కాలం తమపై విషప్రచారం చేశారని ఇచ్చిన తర్వాత సంతోషం వ్యక్తం చెయ్యకుండా విమర్శలు చెయ్యడం సబబు కాదన్నారు.
రైల్వే జోన్ ఏర్పాటుపై చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చూస్తుంటే జోన్ ఇవ్వడం వారికి ఇష్టం లేదోమో అన్నట్లు ఉందన్నారు. చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదని ఘాటుగా విమర్శించారు. కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చెయ్యడానికి వేరే కారణాలు ఉంటాయని అంతేకానీ జోన్ విషయంలో ఆరోపణలు చెయ్యడం తగదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.