పాక్ తో యుద్ధం వ్యాఖ్యలు: వివరణ ఇచ్చిన పవన్ కల్యాణ్

Published : Mar 04, 2019, 07:51 AM IST
పాక్ తో యుద్ధం వ్యాఖ్యలు: వివరణ ఇచ్చిన పవన్ కల్యాణ్

సారాంశం

టీడీపీ, వైసీపీ, బీజేపీ సభల్లో ఏనాడైనా జాతీయ జెండాలు కన్పించాయా పవన్ కల్యాణ్ అడిగారు. ఆ పార్టీల నాయకులు ఏనాడైనా జాతీయ జెండా పట్టుకున్నారా, వాళ్లా దేశభక్తి గురించి మాట్లాడేది అని అన్నారు. 

చిత్తూరు:  తాను ఆళ్లగడ్డలో ఒక మాట మాట్లాడితే పాకిస్థాన్‌ మీడియాలో వస్తుందని కలగన్నానా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. దాన్ని పట్టుకుని మీరు నా దేశభక్తిని శంకిస్తారా అని అడిగారు. ఎన్నికల ముందు భారత్‌-పాక్‌ యుద్ధం వస్తుందని రెండేళ్ల క్రితమే బిజెపి నేతలు చెప్పారంటూ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన విషయం తెలిసిందే.

టీడీపీ, వైసీపీ, బీజేపీ సభల్లో ఏనాడైనా జాతీయ జెండాలు కన్పించాయా పవన్ కల్యాణ్ అడిగారు. ఆ పార్టీల నాయకులు ఏనాడైనా జాతీయ జెండా పట్టుకున్నారా, వాళ్లా దేశభక్తి గురించి మాట్లాడేది అని అన్నారు. తమ సభల్లో మాత్రమే జాతీయ జెండాలు కనిపిస్తాయన్న విషయం గుర్తించుకోవాలని అన్నారు. ఏ రోజు కూడా తన దేశభక్తిని మీ ముందు రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

ఆదివారం చిత్తూరులోని ఓ హోటల్‌లో జనసేన కార్యకర్తలు, విలేకరులతో వేర్వేరుగా ఆయన సమావేశమయ్యారు. రాయలసీమ పర్యటన ముగిసినట్లు చెప్పారు. తాను ఏదైనా మంచి మాట్లాడితే మీడియాలో చూపించరని, తన మాటల్ని వక్రీకరించి పదే పదే చూపిస్తుంటారని ఆయన అన్నారు. భగత్‌సింగ్‌ గురించి మాట్లాడినప్పుడు తాను అన్నదేమిటి, మీరు చూపించిందేమిటని అడిగారు.

బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుపై పరోక్ష విమర్శలు చేశారు. కారుతో ఇద్దరిని గుద్దేసి.. ఒకరు చనిపోతే ఆగకుండా మరో కారులో వెళ్లిపోయిన కనీస మానవత్వం లేని బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు ఇప్పుడు తన గురించి మాట్లాడుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. 1997లోనే తెలంగాణ వచ్చేస్తుందన్నారని, 2014లో తెలంగాణ వస్తుందని వారికి ఏమైనా ముందే తెలుసా అని అన్నారు. నోట్లరద్దు గురించి బ్యాంకర్లు ముందుగానే చెప్పేశారని ఆయన గుర్తు చేశారు. 

2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, మోదీ, తాను కలిసి తిరుగుతున్న సందర్భంలో అవినీతి నిర్మూలనకు పెద్దనోట్ల రద్దు చేయాలన్న ప్రస్తావన వచ్చిందని అన్నారు. అలా అని అంతా ముందే ప్లానింగ్‌ చేసినట్టా అని అడిగారు..
 
రాయలసీమలో మౌలిక వసతులు పుష్కలంగా ఉన్నా పరిశ్రమలు రాకపోవడానికి, అభివృద్ధి జరగకపోవడానికి కొన్ని కుటుంబాలే కారణమని ఆయన విమర్శించారు. సీమ నుంచి చాలామంది ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ అభివృద్ధి ఆ కొన్ని కుటుంబాలకే పరిమితమైందని అన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ముస్లింలు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారని, జనసేన అధికారంలోకి వస్తే ఈ ప్రాంతంపై దృష్టి సారించి ఎన్నడూలేని విధంగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu