
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎన్ని సార్లు అడిగినా తల్లిదండ్రులు ఆస్తి పంచడం లేదనే కోపంతో వారికి కొన్నకొడుకు బతికుండగానే నిప్పు పెట్టాడు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా కణేకల్లుకు చెందిన నారాయణ రెడ్డి, నరసమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు.
వీరిలో చిన్న కొడుకు మధుసూదనరెడ్డి తన వాటా ఆస్తి పంచమంటూ కొద్దిరోజులుగా తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం మరోసారి అమ్మానాన్నలతో గొడవపడ్డాడు.
ఈ సమయంలో కోపంతో ఊగిపోయిన మధుసూదనరెడ్డి... ఇంట్లో ఉన్న పెట్రోలు తీసుకొచ్చి మరోసారి బెదిరించాడు. అప్పటికీ వారు అంగీకరించకపోవడంతో ఏకంగా నిప్పంటించి చంపేందుకు యత్నించాడు.
నారాయణరెడ్డి, నరసమ్మ కేకలు వేయడంతో వెంటనే స్పందించిన చుట్టుపక్కలవారు... మంటలను అదుపు చేసి సమీపంలోని బళ్లారి ఆసుపత్రికి తరలించారు.