
కనిగిరి మాజీ శాసనసభ్యుడు డాక్టర్ ముక్యు ఉగ్ర నరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. పార్టీలోకి రావాల్సిందిగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఆయన తెదేపాలో చేరనున్నారు.
2009 ఎన్నికలలో కనిగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి ఉగ్ర నరసింహారెడ్డి, ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన కొద్దినెలల క్రితం ఆ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌కు దూరమయ్యారు.
ఉగ్రసేన పేరుతో కనిగిరి నియోజకవర్గంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నరసింహారెడ్డి సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయంగాను ఆయనను గమనిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు... ఉగ్రను పార్టీలోకి చేర్చుకోవాలని డిసైడ్ అయ్యారు.
ఇటీవల కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావుతో కలిసి ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. వీరిద్దరిలో ఒకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే... మరోకరికి ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు ప్రతిపాదించారు.
ఈ క్రమంలో కనిగిరిలో సర్వే చేయించిన సీఎం... ఉగ్రకు ప్రజల్లో మద్దతు ఉందని గుర్తించారు. దీంతో వెంటనే టీడీపీలో చేరాల్సిందిగా సమాచారం అందించారు. ఈ క్రమంలో అభిమానులు, అనుచరులతో కలసి శనివారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు.