తోటి విద్యార్థినిపై పదో తరగతి విద్యార్థి లైంగిక దాడి

Published : Mar 01, 2019, 09:03 AM IST
తోటి విద్యార్థినిపై పదో తరగతి విద్యార్థి లైంగిక దాడి

సారాంశం

ఈ నెల 24వ తేదీన బాలిక హాస్టల్‌ గదిలో ఉన్న సమయంలో అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలుడు, ఏడాది కిందట ఆ పాఠశాలలో పదో తరగతి చదివిన మరో బాలుడు కలిసి బాలికను హాస్టల్‌ పైఅంతస్తులోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు.

కడప: పదో తరగతి విద్యార్థినిపై సహ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయంపై స్కూల్‌ యాజమాన్యానికి బాలిక విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. పైగా, పాఠశాల కరస్పాండెంట్‌ బాలికను బెదిరించాడు. దాంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. ఎర్రగుంట్ల మండలానికి చెందిన బాలిక ప్రొద్దుటూరు నేతాజీనగర్‌లోని ప్రైవేట్‌ స్కూల్‌ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతోంది.

ఈ నెల 24వ తేదీన బాలిక హాస్టల్‌ గదిలో ఉన్న సమయంలో అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలుడు, ఏడాది కిందట ఆ పాఠశాలలో పదో తరగతి చదివిన మరో బాలుడు కలిసి బాలికను హాస్టల్‌ పైఅంతస్తులోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. భయంతో వణికిపోయిన బాలిక జరిగిన ఘటన గురించి స్కూల్‌ కరస్పాండెంట్‌కు చెప్పింది. 

ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే చంపేస్తానని, టెన్త్‌ క్లాస్‌ ఫెయిల్‌ చేయిస్తానని కరస్పాండెంట్ బాలికనే బెదిరించాడు. దీంతో తీవ్ర అవమానభారంతో ఆ బాలిక 25వ తేదీన పాఠశాల మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

పాఠశాల మైదానంలో అపస్మారక స్థితిలో పడిఉన్న బాలికను స్కూల్‌ యాజమాన్యం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించింది. మీ పాప స్కూల్‌ భవనంపై నుంచి కాలు జారి కింద పడిందని స్కూల్‌ యాజమాన్యం బాలిక కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి చెప్పారు. అయితే వారు వచ్చేలోపే - పరిస్థితి విషమించిందని, కర్నూలు ఆస్పత్రికి తరలించాలని బాలికను అంబులెన్స్‌లో ఎక్కించారు. 

కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక 27 సాయంత్రం స్పృహలోకొచ్చింది. బాలికకు నడుము, కాళ్లు పూర్తిగా విరిగిపోయాయని వైద్యులు చెప్పారు. తనపై జరిగిన అఘాయిత్యం గురించి తన చిన్నమ్మకు చెప్పింది. ఆస్పత్రి నుంచి ఇంటికెళ్లేందుకు బాలిక కుటుంబ సభ్యులు ప్రయత్నించగా అక్కడ కాపలాగా ఉన్న స్కూల్‌ యాజమాన్యం మనుషులు వారిని అడ్డుకుని బెదిరించారు. 

అయితే, తిరుపతి ఆస్పత్రికి వెళ్తున్నామని చెప్పి బాలికను గురువారం సాయంత్రం ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చి.. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ సీఐ రామలింగమయ్య చెప్పారు.  

PREV
click me!

Recommended Stories

YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu
డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu