వేంపాడు టోల్ గేట్ వద్ద వైసిపి నాయకుల హల్ చల్... సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి (సిసి కెమెరా వీడియో)

By Arun Kumar PFirst Published Nov 5, 2021, 10:03 AM IST
Highlights

 అధికార పార్టీ ప్రజాప్రతినిధిని... నా కారుతో ఆపుతావా అంటూ ఓ వైసిపి జడ్పిటిసి టోల్ సిబ్బందిపై దాడిచేసిన ఘటన విశాఖపట్నంలో జిల్లాలో చోటుచేసుకుంది. 

విశాఖపట్నం: టోల్ ఫీజ్ కట్టమని అడిగినందుకే టోల్ ప్లాజా సిబ్బంది ఓ వైసిపి నాయకుడు, ఆయన అనుచరులు దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా దాడి చేయడంతో టోల్ ప్లాజా సూపర్వైజర్ తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... పాయకరావుపేట వైసిపి నేత, స్థానిక జడ్పిటిసి ఎల్. సూర్యనారాయణ అనుచరులతో కలిసి కారులో వెళుతుండగా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ గేట్ వద్ద సిబ్బంది ఆపారు. తమ విధుల్లో భాగంగా టోల్ ఫీజు చెల్లించాలని సిబ్బంది YSRCP ZPTC ని కోరారు. దీంతో తమనే టోల్ ఫీజు అడుగుతావా అంటూ కారులోని వైసిపి నాయకులు టోల్ సిబ్బందితో ఘర్షణకు దిగారు. 

వీడియో

అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ కారునే ఆపుతావా అంటూ టోల్ సిబ్బందితో సూర్యనారాయణ అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలోనే మాటా మాటా పెరగడంతో కోపంతో ఊగిపోయిన వైసిపి జడ్పిటిసి, ఆయన అనుచరులు టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి దిగారు. 

read more  అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు కూలీల మృతి

కారు దిగుతూనే వైసిపి నాయకులు టోల్ గేట్ సూపర్వైజర్ పి.సత్యనారాయణను విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. మరికొందరు సిబ్బందిపైనా దాడిచేసారు. ఈ ఘర్షణతో టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

వైసిపి నాయకుల దాడిలో టోల్ గేట్ సూపర్వైజర్ సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో తోటి సిబ్బంది అతడిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా వుండటంతో  విశాఖపట్నంలోని కల్యాణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. 

తమ సిబ్బందిపై దాడిని తీవ్రంగా పరిగణించిన టోల్ ప్లాజా యాజమాన్యం నక్కపల్లి పోలీస్ స్టేషన్లో  పిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పాయకరావుపేట వైసీపీ జెడ్పీటీసీ ఎల్. సూర్యనారాయణతో పాటు ఆయన అనుచరులు జే.శ్రీను, డి.నానాజిలపై ఐపీసి 323, 324 సెక్షన్ క్రింద కేసు నమోదు చేసారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అయితే టోల్ ప్లాజా సిబ్బందిపై వైసిపి నాయకులు దాడిచేస్తున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. 

VIDEO  నా కారునే ఆపుతారా: టోల్ గేట్ సిబ్బందిపై దాడి   

గతంలో కూడా ఇలాగే గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ వద్ద వడ్డెర కార్పోరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. టోల్ కట్టమమంటూ తన కారును ఆపిన సిబ్బందిపై ఆమె దాడి చేశారు. టోల్ చెల్లించకుండా వెళ్తుండడంతో సిబ్బంది ఆమెను ఆపేశారు. తన కారునే అపుతారా అటూ బారికేడ్లు తొలగించి సిబ్బందిపై ఆమె చేయి చేసుకున్నారు. తనను టోల్ చెల్లించాలని అడుగుతారా అంటూ సిబ్బందిని దుర్భాషలాడారు. బారికేడ్లను తీసిపారేసి విజయవాడ వైపు వెళ్లారు. 

టోల్ సిబ్బంది ఫిర్యాదుతో దేవళ్ల రేవతితో పాటు ఆమె డ్రైవర్ పై మంగళగిరి పోలీసులు కేసు నమోదుచేసారు. నిబంధనలకు విరుద్దంగా సైరన్  వినియోగం, దౌర్జన్యం, దాడి, టోల్ టాక్స్ ఎగవేత బెదిరింపులకు పాల్పడడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  

టోల్ ప్లాజా సిబ్బంది రేవతిని టోల్ ఫీజు అడిగినందుకు ఆమె దౌర్జన్యం చేశారని టోల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. టోల్ ప్లాజా సిబ్బంది తీరుపై ఆమె వ్యవహరించిన తీరుపై  విమర్శలు వెల్లువెత్తాయి.  తాజాగా మరో అధికార పార్టీ ప్రజాప్రతినిధి కూడా టోల్ సిబ్బందిపై దాడికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. 


 

click me!