ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చకు అనుమతివ్వాలని రాజ్యసభ ఛైర్మెన్ కు వైసీపీ ఎంపీలు నోటీసు ఇచ్చారు. ఈ విషయమై చర్చకు డిమాండ్ చేశారు. వెల్‌లో నిరసనకు దిగారు. దీంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు ఛైర్మెన్ వెంకయ్యనాయుడు.
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాపై చర్చకు వైసీపీ పట్టుబట్టింది. సభలో కార్యక్రమాలకు ఆ పార్టీ ఎంపీలు అడ్డుతగిలారు. దీంతో సోమవారం నాడు రాజ్యసభ వాయిదా పడింది.ఇవాళ ఉదయం కూడ ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని రాజ్యసభ ఛైర్మెన్ తిరస్కరించారు. ఇతర పార్టీల సభ్యులు కూడ తమ డిమాండ్లతో ఆందోళనకు దిగారు. దీంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు రాజ్యసభ వాయిదా పడింది. రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన తర్వాత ప్రత్యేక హోదాపై చర్చ జరపాలని 267 రూల్ కింద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసు ఇచ్చారు.
also read:పార్లమెంటులో వైసీపీ ఎంపీల ఆందోళన: వెల్ లోకి దూసుకెళ్లిన విజయసాయి
రాజ్యసభలో ఇతర వ్యవహరాలన్నింటిని పక్కన పెట్టి రూల్ 267 కింద ప్రత్యేక హోదాపై చర్చించాలని ఆయన ఆ నోటీసులో కోరారు. 2014 మార్చి 1న కేంద్ర మంత్రివర్గం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చిన విషయాన్ని ఆయన ఆ నోటీసులో ప్రస్తావించారు. కానీ రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు ఈ విషయమై చర్చకు సమ్మతించలేదు. సభ కార్యక్రమాలు నిర్వహించారు.
దీంతో తమ నోటీసుకు అనుగుణంగా ప్రత్యేక హోదాపై చర్చించాలని వైసీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. వైసీపీ ఎంపీల ఆందోళనతో కొద్దిసేపు సభ కార్యక్రమాలు కొనసాగాయి. వెల్‌లోకి వచ్చి వైసీపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టుగా రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.