ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సోమవారం నాడు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి నోటీసులు పంపింది. వచ్చే సమావేశానికి వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. అచ్చెన్నాయుడు వివరణ సరిగా లేదని చెబితే ఆయన నుండి స్పందన రాలేదన్నారు.
అమరావతి: టీడీపీ శాసనసభపక్ష ఉపనేత అచ్చెన్నాయుడుకు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సోమవారం నాడు నోటీసులు జారీ చేసింది. వచ్చే సమావేశానికి వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.
సోమవారం నాడు అసెంబ్లీ కమిటీహల్‌లో ప్రివిలేజ్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో తొమ్మిది అంశాలపై చర్చించారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు స్పీకర్ పై చేసిన విమర్శలపై సమావేశం చర్చించింది.శాసన సభ సభ్యుల పేర్లు శిలాఫలకంలో లేకపోవడం, అధికారులు సరిగ్గా స్పందించకపోవడం, శాసన సభ్యులను కించపరచడం,ప్రొటోకాల్ పాటించని తదితర ఫిర్యాదులపై సమావేశలో చర్చించారు.
స్సీకర్ పై విమర్శలు చేయడం సరైంది కాదని సమావేశం అభిప్రాయపడింది.కొన్ని అంశాల్లో అచ్చెన్నాయుడు సరైన వివరణ ఇవ్వలేదని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. అచ్చెన్నాయుడు మొదటిసారి ఇచ్చిన వివరణ సరిగ్గా లేనందున రెండవ సారి వివరణ కోరితే ఆయన పట్టించుకోలేదన్నారు.ఈ విషయమై వచ్చే సమావేశానికి హాజరు కావాలని అచ్చెన్నాయుడికి నోటీసులు పంపారు. సీడీ వంటి ఆధారాలతో సహా పంపినా కొంతమంది సభ్యులు వివరణ సరిగ్గా ఇవ్వలేదన్నారు. సరైన సమాధానం చెప్పని సభ్యులని వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రివిలేజ్ కమిటీ పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. శాసన సభ్యుల హక్కులు కాపాడటం తమ విధి అని ఆయన చెప్పారు.
దీంతో ఆయనని వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిస్తున్నట్టుగా చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో హాజరుకాలేనని మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణనిచ్చారు. నిమ్మగడ్డపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఎవరు ఎవరిపై తప్పుడు వ్యాఖ్యలు చేసినా పరిగణనలోకి తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. సభ్యులందరి హక్కులు కాపాడటం కోసం ప్రివిలేజ్ కమిటీ పనిచేస్తుందన్నారు. ఈ ఏడాది ఆగష్ట్ 10వ తేదీన తదుపరి ప్రివిలేజ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ప్రివిలేజ్ కమిటీ సభ్యులు మల్లాది విష్ణు,యూ.వి రమణ మూర్తి రాజు, ఎస్.వి చిన అప్పలనాయుడు, వి.వర ప్రసాద రావు,శిల్పా చక్రపాణి రెడ్డి , అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణ మా చార్యులు తదితరులు హాజరయ్యారు.