పోలవరం ప్రాజెక్టు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై వైసీపీ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి వెల్ లోకి దూసుకెళ్లారు.
న్యూఢిల్లీ: పోలవరం, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టులపై రాజ్యసభలో వైసీపీ ఎంపీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు తిరస్కరించారు. దీంతో వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఆందోళకు దిగారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభ వెల్ లోకి దూసుకెళ్లారు.
సీట్లో కూర్చోవాలని వెంకయ్యనాయుడు పదే పదే హెచ్చరించినప్పటికీ వైసీపీ ఎంపీలు తమ నిరసనను వీడలేదు. పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించాలని వైసీపీ ఎంపీలు కోరారు. అేద సమయంలో మూడేళ్లయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని విజయసాయి రెడ్డి విమర్శించారు.
ప్రత్యేక హోదాపై చర్చించాలని, చర్చ తర్వాత ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.
అదే విధంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలనే విషయంపై లోకసభ సభ్యుడు మిథున్ రెడ్డి వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత లేకుండా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే ఏడాదిలోగా పోలపరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే విధంగా కేంద్రం నిధులు విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.