ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ కసరత్తు.. మంత్రులకు ఎమ్మెల్యేల బాధ్యత.. ఈరోజు మాక్ పోలింగ్..!!

By Sumanth KanukulaFirst Published Mar 18, 2023, 1:00 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ కసరత్తును ముమ్మరం చేసింది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ కసరత్తును ముమ్మరం చేసింది. ఏపీలో ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనున్న సంగతి  తెలిసిందే. ఇందుకు సంబంధించి వైసీపీ అభ్యర్థుల ఎన్నిక  ఏకగ్రీవమే అని భావించినప్పటికీ.. టీడీపీ కూడా అభ్యర్థిని బరిలో నిలుపడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే వైసీపీ అధిష్టానం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త  చర్యల్లో భాగంగా.. ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేల ఓట్లు  వృథా కాకుండా కసరత్తు చేపట్టింది.

పలువురు మంత్రులకు 20 మంది ఎమ్మెల్యేల చొప్పున బాధ్యతను అప్పగించింది. ఎన్నికల కసరత్తులో భాగంగా.. ఈ  రోజు మధ్యాహ్నం 3 గంటలకు తమ సభ్యులతో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు రెడీ అయింది. అసెంబ్లీ ప్రాంగణంలోని మీటింగ్‌ హాల్‌లో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. 

ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ  ఎన్నికలకు మార్చి 23న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి పెనుమత్స సూర్యనారాయణ రాజు, కోలా గురువులు, ఇజ్రాయిల్, మ‌ర్రి రాజశేఖర్, జయమంగళం వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నంలు బరిలో నిలిచారు. టీడీపీ నుంచి పంచుమర్తి అనురాధ బరిలో ఉన్నారు. 

click me!