దావోస్‌లో ఏపీకి పెట్టుబడులు రాకూడదనే.. కోనసీమ అల్లర్లు వెనుక చంద్రబాబు : విజయసాయిరెడ్డి ఆరోపణలు

By Siva Kodati  |  First Published May 25, 2022, 4:56 PM IST

కోనసీమ అల్లర్లకు సంబంధించి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. దావోస్ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు రాకుండా చేసేందుకే ఇలా చేశారంటూ ఆయన ఆరోపించారు. 


టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) మండిపడ్డారు. దావోస్ సదస్సు (davos summit) ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనే ఉద్దేశంతోనే కోనసీమలో చంద్రబాబు గ్యాంగ్ విధ్వంసకాండకు పాల్పడిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతల పరిస్థితి బాగా లేదన్న కళంకం తెచ్చేందుకే ఈ దారుణానికి ఒడిగట్టారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. 

అంబేద్కర్‌ను అవమానిస్తే జాతి క్షమించదని, రాజకీయంగా పుట్టగతులు లేకుండా పోతారని ఆయన మండిపడ్డారు. మంటలు రాజేసి ప్రజాభిమానం పొందాలని చూడడం వృథా ప్రయాసేనని విజయసాయిరెడ్డి హితవు పలికారు. నిప్పుతో చెలగాటం మంచిది కాదని, ఇలాంటి కుట్రలకు పాల్పడిన వారంతా చరిత్ర హీనులుగా మిగిలారని ఆయన గుర్తుచేశారు. దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేయడం దగ్గర్నుంచి.. చంద్రబాబు చేసిన అనేక అరాచకాలను జనం మరచిపోలేదని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. కేసుల్లో ఇరుక్కోవడం తప్ప.. రెచ్చగొట్టి సాధించేదీ ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. 

Latest Videos

అంతకుముందు కోనసీమ జిల్లా పేరు మార్పు నేఫథ్యంలో చెలరేగిన విధ్వంసకర సంఘటనలపై రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి దాడిశెట్టి రాజా (dhadishetty raja) కీలక వ్యాఖ్యలు చేసారు. కోనసీమలో అలజడికి చంద్రబాబు నాయుడు (chandrababu naidu), పవన్ కల్యాణ్ (pawan klayan) కుట్ర పన్నారని మంత్రి ఆరోపించారు. అమలాపురం విధ్వంసం (amalapuram violance)లో నిందితులు ఎవరైనా వదిలిపెట్టేదిలేదని మంత్రి రాజా హెచ్చరించారు. 

konaseema violance : మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ళపై దాడిచేసినవారు అరెస్ట్: హోంమంత్రి వనిత

''కోనసీమ జిల్లాకు కోనసీమ - అంబేడ్కర్ పేరు పెట్టాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి, మరికొన్ని పార్టీలు వినతిపత్రాలు ఇచ్చాయి. మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజలు మొత్తంగా ఏకకంఠంతో కోనసీమ-అంబేడ్కర్ జిల్లాకు మద్దతు పలికారు. ప్రభుత్వం ఆ విధంగా ముందుకువెళ్ళి నిర్ణయం తీసుకున్నాక టీడీపీ, జనసేన పార్టీలు అగ్గి రాజేశాయి. ఈ రెండు పార్టీలు సమన్వయంతో కుట్రలు చేస్తూ ప్రజల ముందు ఒకరకంగా, ప్రజలు వెనుక మరోరకంగా మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న కోనసీమలో చిచ్చు పెట్టారు. ఇటువంటి కుట్ర రాజకీయాలను రాష్ట్ర ప్రజలంతా ముక్త కంఠంతో ఖండించాలి. అటువంటి పార్టీలను శిక్షించాలి'' అని మంత్రి సూచించారు. 

''ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి వరకు రాష్ట్రానికి ఏకైక విలన్ ఎవరన్నా ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడే. ఎన్టీఆర్ నుంచి వైఎస్ఆర్, కేసిఆర్, వంగవీటి మోహన్ రంగా, జగన్ వరకు.. అందరికీ విలన్ చంద్రబాబు నాయుడే. బాబు మచ్ఛలను కవర్ చేయడానికి పచ్చ మీడియా, ఎల్లో ఛానల్స్, వ్యవస్థల్లోని కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. వీరంతా ఉన్నారన్న నమ్మకంతోనే చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు. కొన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని, ప్రజలంటే భయం లేకుండా, రాష్ట్ర ప్రజలతో తన ఇష్టం వచ్చినట్లుగా చెత్త రాజకీయం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం'' అన్నారు.

click me!