బ్రేకింగ్ : పోలీసుల అదుపులో అమలాపురం అల్లర్ల వెనుక సూత్రధారి

By Siva KodatiFirst Published May 25, 2022, 4:30 PM IST
Highlights

అమలాపురం ఆందోళనలల్లో కీలక నిందితుడైన అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ గతంలో కిరోసిన్ పోసుకుని అన్యం సాయి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతనిపై రౌడీ షీట్ వున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 

అమలాపురం ఆందోళనలల్లో కీలక నిందితుడైన అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ గతంలో కిరోసిన్ పోసుకుని అన్యం సాయి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతనిపై రౌడీ షీట్ వున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 

మరోవైపు.. కోనసీమలో పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ (ap dgp) కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి (kasireddy rajendranath reddy) సమీక్ష చేపట్టారు. ఏలూరు రేంజ్ డీఐజీ, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిన్న అమలాపురంలో చోటుచేసుకున్న విధ్వంసం, ప్రస్తుతం అక్కడున్న పరిస్థితుల గురించి డీజీపీ ఆరా తీశారు. ఆ తర్వాత ఓ తెలుగు న్యూస్ చాన‌ల్‌తో డీజీపీ మాట్లాడుతూ.. కొనసీమకు అదనపు బలగాలను తరలించడం జరిగిందన్నారు. 2000 మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా చెప్పారు. గుంపులుగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 7 కేసులు నమోదు చేసినట్టుగా తెలిపారు. 

ప్రస్తుతం కొనసీమలో (konaseema district) పరిస్థితి అదుపులోనే ఉందని డీజీపీ చెప్పారు. అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉందని తెలిపారు. నిన్న హింసాత్మక ఘటనలకు పాల్పడిన 72 మందిని గుర్తించామని చెప్పారు. ఇప్పటివరకు 46 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. నగరంలోని రౌడీ షీటర్లను కూడా అదుపులోకి తీసుకుంటున్నట్టుగా చెప్పారు. పోలీసులు సంయమనం పాటించి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నారని తెలిపారు. 

కొనసాగుతున్న టెన్షన్..
ప్రస్తుతం కోనసీమలో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. అమలాపురం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ పికెట్లను ఏర్పాట్లు చేశారు. నిన్నటి ఘటనల దృష్ట్యా కొనసీమకు ఇతర జిల్లాల నుంచి కూడా బలగాలను రప్పించారు. సున్నితమైన ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షించే బాధ్యతలను సీనియర్ ఐపీఎస్‌లకు బాధ్యతలు అప్పగించారు. కోనసీమలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఏలూరు డీఐజీ పాలరాజు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మళ్లీ ఆందోళనలు జరిగే అవకాశం ఉండొచ్చనే అనుమానంతో.. అమలాపురం మొత్తం పోలీసుల నిఘా నీడలోకి వెళ్లింది. 

అమలాపురం డిపో నుంచి సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. అలాగే కాకినాడ, రాజమండ్రి నుంచి కోనసీమకు బస్సు సర్వీసులు రద్దు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అమలాపురం వచ్చే బస్సులను కూడా నిలిపివేశారు. ఇక, ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్ల మీదకు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కోనసీమ జిల్లా సాధనసమితి చలో రావులపాలెంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. 

ఇంటర్‌నెట్ సేవలు బంద్..
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అమలాపురంలో ఇంటర్‌నెట్ సేవలను (internet services) నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అన్ని నెట్‌వర్క్‌లకు సంబంధించిన ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు. సామాజిక మాద్యమాల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేలా ఈ చర్యలు చేపట్టారు. నిన్న జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని.. పరిస్థితులు చక్కబడేవరకు ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

పరిస్థితి అదుపులో ఉంది.. డీఐజీ పాలరాజ్
నిన్నటి అల్లర్లకు కారణమైన వారిని కొందరిని గుర్తించామని డీఐజీ పాలరాజ్ చెప్పారు. అమలాపురం పూర్తిగా పోలీసుల ఆధీనంలోనే ఉందని చెప్పారు. పుకార్లను ఎవరూ నమ్మవద్దని కోరారు. హింసాత్మక సంఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అమలాపురంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు. 

click me!