బాబుకు షాక్: మోత్కుపల్లితో విజయసాయి రెడ్డి భేటీ, జగన్ అస్త్రమిదే

First Published Jun 14, 2018, 6:47 PM IST
Highlights

బాబుకు జగన్ కౌంటర్ వ్యూహం


హైదరాబాద్: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుతో  వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గురువారం నాడు సమావేశమయ్యారు. టిడిపి నుండి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి నర్సింహులు విజయసాయిరెడ్డి కలవడం ప్రాధాన్యతను సంతరించుకొంది.ఏపీలో యాత్ర నిర్వహిస్తానని ప్రకటించిన మోత్కుపల్లి నర్సింహులుకు విజయసాయిరెడ్డి సంఘీభావాన్ని ప్రకటించారు. బాబుపై మోత్కుపల్లి చేస్తున్న విమర్శలు రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు వైసీపీ పావులు కదుపుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఈ ఏడాది మే 28వ తేదిన తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయనను పార్టీ నుండి బహిష్కరించారు.  ఆ తర్వాత కూడ చంద్రబాబుపై మోత్కుపల్లి విమర్శలు కొనసాగిస్తున్నారు.  ఏపీలో ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాటం చేస్తున్నారని  కూడ ఆయన జగన్‌ను ప్రశంసించారు. 

ఏపీలో బాబుకు ఓట్లు వేయొద్దని కోరుతూ  తిరుమలకు వచ్చి వెంకటేశ్వరస్వామిని వేడుకొంటానని ఆయన చెప్పారు.  అంతేకాదు ఏపీలో కూడ పర్యటిస్తానని ఆయన చెప్పారు.  ఈ ప్రకటన చేసిన కొద్దికాలానికే మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం హైద్రాబాద్‌లో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుతో సమావేశమయ్యారు. 

గురువారం నాడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  మోత్కుపల్లి నివాసానికి వచ్చి  ఆయనతో సుమారు 40 నిమిషాల పాటు చర్చించారు. రెండు రోజుల క్రితం కూడ మోత్కుపల్లి నర్సింహులును కలుసుకొనేందుకు విజయసాయిరెడ్డి  మోత్కుపల్లి నివాసానికి వచ్చారు.  అయితే అక్కడ మీడియా ఉండడంతో ఆయన  మోత్కుపల్లిని కలవకుండానే వెళ్ళిపోయారు.

ఇవాళ మాత్రం మోత్కుపల్లి నర్సింహులుతో  విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు. ఏపీలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఏపీలో మోత్కుపల్లి నర్సింహులు పర్యటిస్తానని ప్రకటించారు. బాబు ఓడిపోవాలని కొరేందుకు తిరుమల వెంకన్నకు మొక్కుకొంటానని ఆయన చెప్పారు.  తిరుమల యాత్రకు విజయసాయిరెడ్డి  సంఘీ భావాన్ని ప్రకటించారు.


శత్రువుకు శత్రువు మిత్రుడు అనే చందంగా  ఏపీలో టిడిపిని రాజకీయంగా దెబ్బతీసేందుకు మోత్కుపల్లిని ఉపయోగించుకోవాలని  వైసీపీ ప్లాన్ చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దళితుల మధ్య బాబు చిచ్చు పెట్టారని కూడ మోత్కుపల్లి నర్సింహులు ఆరోపణలు చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో నర్సింహులు ఏపీలో పర్యటించి చంద్రబాబుకు, టిడిపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే  రాజకీయంగా తమకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.  ఈ వ్యూహంలో భాగంగానే  నర్సింహులుతో విజయసాయి రెడ్డి సమావేశమయ్యారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
 

click me!